ఎవరెస్ట్ ఎక్కిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు... గిన్నిస్ రికార్డు తండ్రికి అంకితం

29 Jul, 2022 21:19 IST|Sakshi

కాఠ్మాండు: చాలా మంది పిల్లలు వాళ్ల తల్లిదండ్రుల ఆస్తులను వారసత్వంగా పొందుతారు. కానీ తండ్రి ఇష్టాన్నే తమ ఇష్టంగా భావించారీ ముగ్గురు అక్కాచెల్లెళ్లు. తండ్రికి ఇష్టమైన పర్వతారోహణను వారూ స్వీకరించి ముగ్గురికి ముగ్గురూ ఎవరెస్ట్‌ను అధిరోహించారు. తద్వారా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డునూ నెలకొల్పారు. ఇప్పటివరకూ ఇంతమంది అక్కాచెల్లెళ్లు ఒకేసారి ఎవరెస్ట్‌ ఎక్కలేదట.  ఆ రికార్డును వారు తమ తండ్రికి అంకితం కూడా చేశారు.

ఇది తమ మొదటి అడుగేనని, త్వరలో రష్యాలోని ఎల్‌బ్రస్‌ పర్వతాన్ని అధిరోహిస్తామని చెబుతున్నారు. అంతేకాదు.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శిఖరాలైన ‘సెవెన్‌ సమ్మిట్స్‌’ పూర్తి చేసి రికార్డ్‌ నెలకొల్పాలనే ప్లాన్‌లో ఉన్నారు నేపాల్‌కు చెందిన దావా ఫుతి షెర్పా, నిమా జంగ్మూ షెర్పా, సెరింగ్‌ నంగ్యా షెర్పా. వీళ్ల తాత కూడా పర్వతారోహకుడే. ఇక వాళ్ల నాన్న డోర్జీ షెర్పా పర్వతారోహణ శిక్షకుడిగా, గైడ్‌గానూ పనిచేశాడు. మొట్టమొదటి సారి ఆయన 1982లో జపనీస్‌ పర్వతారోహకులతో కలిసి చలికాలంలో మౌంట్‌ ఎవరెస్ట్‌ ఎక్కినప్పుడు ఆ చల్లదనానికి ఆయన ఎనిమిది వేళ్లు పాడైపోయాయి. అయినా ఆయన పర్వతారోహణను మానలేదు. 2007 వరకు కొనసాగించాడు.

ఆ తండ్రి వారసత్వాన్ని పిల్లలూ తీసుకున్నారు. ఈ అక్కాచెల్లెళ్లకంటే ముందు వాళ్ల సోదరుడు మింగ్మా సైతం ఆరుసార్లు ఎవరెస్టును అధిరోహించాడు. అంటే.. ఫ్యామిలీ ఫ్యామిలీ పర్వతారోహకులన్నమాట.
చదవండి: రిషి సునాక్‌కు ఇబ్బందికర ప్రశ్నలు.. ఎందుకు వెన్నుపోటు పొడిచారని అడిగిన టోరీ సభ్యులు

మరిన్ని వార్తలు