టిక్‌టాక్‌ విషయంలో ట్రంప్‌కి చుక్కెదురు

29 Sep, 2020 04:07 IST|Sakshi

న్యూయార్క్‌: ప్రముఖ వీడియో యాప్‌ టిక్‌టాక్‌పై నిషేధం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం అమలును ఫెడరల్‌ జడ్జి తాత్కాలికంగా వాయిదా వేశారు. నిషేధం ఉత్తర్వులు అమల్లోకి రావడానికి కొద్ది గంటల ముందే ఈ పరిణామం చోటుచేసుకుంది. అయితే, అధ్యక్ష ఎన్నికల తర్వాత నవంబర్‌ నుంచి అమలు కావాల్సిన ఉత్తర్వుల వాయిదాకు కొలంబియా డిస్ట్రిక్ట్‌ కోర్ట్‌ జడ్జి కారల్‌ నికోలస్‌ నిరాకరించారు.

ఈ నిషేధం తమ వ్యాపారానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని, ఇది ఒప్పందానికి విరుద్ధమని, టిక్‌టాక్‌ కేవలం యాప్‌ కాదని, పౌరులందరికీ ఉపయోగపడే ఆధునిక వేదిక అని, తక్షణం నిషేధం విధిస్తే తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని టిక్‌టాక్‌ న్యాయవాది జాన్‌హాల్‌ వాదించారు. టిక్‌టాక్‌ యాప్‌ జాతీయ భద్రతకు ప్రమాదకరమని, అమెరికా టిక్‌టాక్‌ కార్యకలాపాలను అమెరికన్‌ కంపెనీలకు అమ్మాలని, లేదా దేశం నుంచి నిషేధం ఎదుర్కోవాల్సిందేనని ట్రంప్‌ ఆగస్టు 6న ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై సంతకం చేసిన సంగతి తెలిసిందే.

టిక్‌టాక్‌కి చైనాకి చెందిన బైట్‌డాన్స్‌ మాతృ సంస్థ. అమెరికాలో కార్యకలాపాలు సజావుగా సాగేందుకు ఈ కంపెనీ యత్నిస్తోంది. ఒరాకిల్,  వాల్‌మార్ట్‌లతో వ్యాపారం సాగించడానికి సంప్రదింపులు జరుపుతోంది. దేశ భద్రతకు ఈ యాప్‌  ప్రమాదకరమని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. అమెరికా పౌరుల సమాచారాన్ని టిక్‌టాక్‌ ద్వారా చైనాకు చేరవేస్తున్నారని వైట్‌ హౌస్‌ అభిప్రాయపడింది. అమెరికాలోని తమ కంపెనీలను రక్షించుకోవడానికి తగు చర్యలు చేపట్టనున్నట్టు చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది.

మరిన్ని వార్తలు