టైమ్‌ మ్యాగజీన్‌ 2020: ప్రధాని మోదీ, బిల్కిస్‌లకు స్థానం

23 Sep, 2020 17:53 IST|Sakshi

న్యూఢిల్లీ/న్యూయార్క్‌: ప్రఖ్యాత టైమ్‌ మ్యాగజీన్‌ 2020 ఏడాదిగానూ ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేసిన ‘‘అత్యంత ప్రభావశీల వ్యక్తుల’’ జాబితాను విడుదల చేసింది. భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు షాహిన్‌బాగ్‌ దాదీగా ప్రాచుర్యం పొందిన బిల్కిస్‌,  బాలీవుడ్‌ నటుడు ఆయుష్మాన్‌ ఖురానా ఈ లిస్టులో చోటు దక్కించుకున్నారు. లీడర్స్‌ కేటగిరీలో ప్రధాని మోదీ, ఐకాన్స్‌  కేటగిరిలో బిల్కిస్‌ స్థానం సంపాదించుకున్నారు. ప్రముఖ జర్నలిస్టు, రచయిత రాణా ఆయుబ్‌.. ‘‘ఓ చేతిలో జపమాల, మరో చేతిలో జాతీయ జెండాతో బిల్కిస్‌ భారత్‌లోని అణచివేయబడిన వర్గాల తరఫున గళమెత్తింది. 82 ఏళ్ల వయస్సులో పొద్దున 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకు నిరసనల్లో పాల్గొంది’’అంటూ ఈ బామ్మ గురించి టైమ్‌ మ్యాగజీన్‌లో పేర్కొన్నారు. (చదవండిరైతుల ఆర్థిక స్థితి మారుతుంది: మోదీ )

కాగా ఎన్డీయే సర్కారు ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీలోని షాహిన్‌బాగ్‌లో చిన్నాపెద్దా తేడాలేకుండా ప్రతి ఒక్కరు నిరసనలు తెలియజేస్తూ దీక్ష చేపట్టారు. ఈ ఆందోళనల్లో భాగమైన 82 ఏళ్ల బిల్కిస్‌ దాదీ మీడియా దృష్టిని ఆకర్షించారు. ‘‘ఇక్కడ చూడండి. కేవలం ముస్లింలు మాత్రమే నిరసన చేపట్టలేదు. అన్ని మతాల వారు వచ్చి ఇందులో పాలుపంచుకుంటున్నారు. భోజనం పంచుతున్నారు.

మాకోసం కొందరు అరటిపళ్లు తీసుకువచ్చారు. మరికొందరు జ్యూస్‌, బిస్కట్లు తెస్తున్నారు. చూడండి ఇక్కడ అంతా కలిసే ఉన్నారు’’ అంటూ మతసామరస్యాన్ని, భిన్నత్వంలో ఏకత్వ భావన గురించి అమూల్యమైన మాటలు చెప్పి అందరి మనసులు గెలుచుకున్నారు. ఇప్పుడు ప్రఖ్యాత టైమ్‌ మ్యాగజీన్‌లో చోటు సంపాదించుకుని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. 

ట్రంప్‌, కమలా హారిస్‌ కూడా
ఇక పలు సామాజిక సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన సినిమాల్లో నటించిన ఆయుష్మాన్‌ ఖురానా ఆర్టిస్టుల కేటగిరీలో స్థానం సంపాదించుకున్నారు. కాగా టైమ్‌ మ్యాగజీన్‌ విడుదల చేసిన 100 మంది ప్రభావశీలుర జాబితాలో గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, అమెరికా ఉపాధ్య పదవికి పోటీపడుతున్న కమలా హారిస్‌, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌, తైవాన్‌ అధ్యక్షురాలు త్సాయి ఇంగ్‌- వెన్‌, అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన జో బైడెన్‌, ప్రొఫెసర్‌ రవీంద్ర గుప్తా తదితరులు ఈ లిస్టులో ఉన్నారు.(చదవండి: 244 ఏళ్ల స్వాత్రంత్ర్య చరిత్ర: మహిళకు దక్కని అవకాశం!)

మరిన్ని వార్తలు