ట్రస్‌ను గద్దెదించి.. రిషి సునాక్‌ను ప్రధాని చేసేందుకు రెబల్స్‌ పన్నాగం!

15 Oct, 2022 09:19 IST|Sakshi

లండన్‌: యూకే సంక్షోభం నడుమ ప్రధాని పీఠం నుంచి లిజ్ ట్రస్‌ను దించేసి..  రిషి సునాక్‌తో భర్తీ చేయడానికి రెబెల్స్ పన్నాగం పన్నినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మెజార్టీ కన్జర్వేటివ్‌ పార్టీ రెబల్స్‌ అభిప్రాయంతో కూడిన ఓ నివేదిక బహిర్గతమైంది. 

ట్రస్‌ సారథ్యంలో ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌తో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలై గందరగోళానికి దారి తీసింది. ఈ బడ్జెట్‌తో దేశంలో ఆర్థిక మాంద్యం తలెత్తుతుందన్న ఆందోళనలు అధికమయ్యాయి. ఊహించని ఈ పరిణామాలతో ఏకంగా తన మద్దతుదారు, ఆర్థిక మంత్రి అయిన క్వాసీని పదవి నుంచి తప్పించి.. ఆ స్థానంలో జెరెమీ హంట్‌ను కొత్త ఆర్థిక మంత్రిగా నియమించారామె. అయితే.. 

కన్జర్వేటివ్ పార్టీలో ఈ పరిణామాలేవీ సహించడం లేదు. ప్రత్యేకించి రెబల్స్‌ మాత్రం లిజ్ ట్రస్‌ను పార్టీ నేతగా తప్పించి.. మాజీ ప్రధాని ప్రత్యర్థి రిషి సునాక్‌ను గద్దె ఎక్కించే యత్నం జరుగుతోందని ది టైమ్స్‌ YouGov పోల్‌ వెల్లడించింది. అంతేకాదు కన్జర్వేటివ్‌లో సగం మంది తాము తప్పుడు అభ్యర్థిని ఎన్నుకున్నామనే భావనలోకి చేరుకున్నట్లు ఆ పోల్‌ సర్వే తెలిపింది. సుమారు 62 శాతం మంది తమది రాంగ్‌ ఛాయిస్‌ అయ్యిందనే పశ్చాత్తంలో ఉండిపోయారట. ఇక.. 15 శాతం సభ్యులు మాత్రం తమ నిర్ణయం సరైందే అనే అభిప్రాయం వ్యక్తం చేశారట.

అదే సమయంలో రిషి సునాక్‌తో పాటు ప్రత్యామ్నాయ అభ్యర్థుల పరిశీలన సైతం టోరీ సభ్యులు ప్రారంభించారని.. అందులో ప్రధాని అభ్యర్థి రేసులో మూడో స్థానంలో నిలిచిన పెన్నీ మోర్డాంట్‌ సైతం ఉన్నారని ఆ పోల్‌ వెల్లడించింది. 

అయితే యూకే చట్టాల ప్రకారం టెక్నికల్‌గా లిజ్‌ ట్రస్‌కి ఏడాదిపాటు పదవి గండం ఎదురు కాదు. ఒకవేళ 1922 బ్యాక్‌బెంచ్ ఎంపీల కమిటీ తన రూల్స్‌ మారిస్తే గనుక ట్రస్‌కు సవాల్‌ ఎదురుకావొచ్చు. అప్పుడు కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యుల మద్దతుతో రిషి సునాక్‌, పెన్నీ మోర్డాంట్‌లు ప్రధాని, ఉపప్రధాని పదవులను అందుకోవచ్చు. ఇదికాగా.. నేరుగా పెన్నీ మోర్డాంట్‌ ప్రధాని అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

కానీ, ఇదంతా సులభమైన విషయమేమీ కాదని మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ మద్దతుదారు, ఎంపీ నాడైన్‌ డోరీస్‌ చెప్తున్నారు.  అదే సమయంలో అధికార మార్పు అనుకున్నంత ఈజీనే అంటూ కన్జర్వేటివ్‌ సీనియర్‌ సభ్యులు ఒకరు చేసిన వ్యాఖ్యల్ని ది టైమ్స్‌ కథనం ఉటంకించింది.

ఇదీ చదవండి: ఉక్రెయిన్‌తో యుద్ధంపై పుతిన్‌ కీలక ప్రకటన

మరిన్ని వార్తలు