Beast Snake Titanoboa: భయానకం.. యాభై అడుగుల భారీ పాము!

5 Apr, 2022 10:52 IST|Sakshi

అనకొండ, కొండ చిలువలు.. పాముల్లో ఒకరకంగా భారీవి, భయంకరమైనవి అని చెప్పుకుంటాం. కానీ,  దక్షిణ, దక్షిణి తూర్పు ఆసియా దేశాల్లో కనిపించే రెట్రిక్యూలేటెడ్‌ పైథాన్‌ ఇప్పటిదాకా ప్రపంచంలో అధికారిక అతిపెద్ద పాము. ఆరున్నర మీటర్ల పొడవు పెరిగే ఈ పైథాన్‌.. 75 కేజీల దాకా బరువు ఉంటుంది. అయితే ఇంతకు మించిన భారీతనం ఉన్న పాము గురించి ఎప్పుడైనా విన్నారా?.. 

టైటానోబోవా.. ఈ భూమ్మీద ఇప్పటిదాకా అత్యంత పెద్ద పాముగా పేరుగాంచింది. 1,200 కేజీలకు పైగా బరువు, 48 అడుగులకు పైగా పొడవు ఉండే ఈ పాములు.. డైనోసార్ల కంటే ముందు కాలంలో ఈ భూమ్మీద జీవించేవని, సుమారు 60 మిలియన్ల సంవత్సరాలకు పూర్వం వర్షారణ్యాల్లో వీటి ఉనికి ఎక్కువగా ఉండేదని అమెరికాకు చెందిన స్మిత్‌సోనియన్‌ ఇనిస్టిట్యూట్‌ పరిశోధకులు చెప్తున్నారు. అంతేకాదు కొలంబియా కెర్రెజోన్‌ కోల్‌ మైన్‌ గర్భంలో ఇందుకు సంబంధించిన శిలాజాలను సైతం సేకరించినట్లు వాళ్లు వెల్లడించారు. 

సుమారు 50 అడుగులకు పైగా పొడవుండే టైటానోబోవా Titanoboa.. ఒక స్కూల్‌బస్సు కంటే సైజులో పెద్దదిగా ఉంటుంది. అంతేకాదు ఒకవేళ ఆహారపు గొలుసులో గనుక దీనిని చేరిస్తే.. ఇదే టాప్‌లో ఉంటుంది కూడా. పరిశోధకులు ఈ మెగాస్నేక్‌కు బీస్ట్‌గా అభివర్ణిస్తుంటారు. 

అంతేకాదు ఆ కాలంలో బతికిన.. భారీ మోసళ్లను, తాబేళ్లను ఇవి చుట్టేసి పచ్చడిగా చేసి మరీ తినేసేదట. 2012లో టైటానోబోవా మీద ‘టైటానోబోవా: మాంస్టర్‌ స్నేక్‌’ పేరుతో ఒక డాక్యుమెంటరీ కూడా తీశారు. దానిని స్మిత్‌సోనియన్‌ నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ నేచురల్‌ హిస్టరీలో ప్రదర్శించారు కూడా. మరి ఈ మెగా స్నేక్‌ ప్రస్తావన ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటారా?

తాజాగా సోషల్‌ మీడియాలో.. ఒక భారీ పాము అస్థిపంజరం వైరల్‌ అయ్యింది. ఫ్రాన్స్‌ తీరంలో గూగుల్‌ మ్యాప్‌ ద్వారా ఇది అసలైన పాము అస్థిపంజరమే అని, అదీ టైటానోబోవాదే అని  చర్చించుకున్నారు కూడా. అయితే.. అది ఒక భారీ ఆర్ట్‌ వర్క్‌ అని తర్వాతే తేలింది.

    

మరిన్ని వార్తలు