ప్రధాని పదవి పూలపాన్పు కాదు.. రిషికి ముందుంది ముళ్లబాటే..!

26 Oct, 2022 07:33 IST|Sakshi

అపజయం ఎదురైన చోటే విజయాన్ని అందుకొని బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్‌కు  ఆ పదవి పూలపాన్పు కాదు. ముందున్నది అంతా ముళ్లబాటే. బ్రెగ్జిట్, కోవిడ్‌–19 సంక్షోభం, , రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధంతో ఆర్థికంగా కుదేలైపోయిన బ్రిటన్‌ను దారిలోని తీసుకురావాల్సిన అతి పెద్ద సవాల్‌ ఆయన ఎదురుగా ఉంది. 

ఆర్థిక సవాళ్లు  
బ్రిటన్‌లో ప్రస్తుతం ఎగుమతులయ్యే వ్యయం కంటే దిగుమతులకయ్యే వ్యయం బాగా పెరిగిపోయింది. ఫలితంగా కనీవినీ స్థాయిలో ద్రవ్యోల్బణం 10% దాటిపోయి ధరలు ఆకాశాన్నంటాయి.  సామాన్య ప్రజలు ధరాభారాన్ని మోయలేకపోతూ ఉంటే కార్పొరేట్‌ సెక్టార్‌ కుదేలైపోయింది. రష్యా ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావంతో విద్యుత్‌ బిల్లులు తడిసిమోపెడవుతున్నాయి. రానున్న చలికాలంలో  ఫ్రీజింగ్‌ గ్యాస్‌ను కొనుక్కోవడం కూడా ప్రజలకు భారం కానుంది.

దీంతో ఈ సారి చలికాలంలో మరణాలు ఎక్కువగా సంభవిస్తాయన్న అంచనాలున్నాయి. సరైన ఆదాయ మార్గాలు చూపించకుండా ఎడాపెడా పన్ను మినహాయింపులనిస్తూ లిజ్‌ట్రస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌తో కుదేలైపోయిన మార్కెట్లను బలోపేతం చేయడంపై రిషి దృష్టి సారించాల్సి ఉంది. పన్నులు పెంచుతూ, ఖర్చుల్ని తగ్గించడం రిషి ముందున్న అతి పెద్ద టాస్క్‌. 

పార్టీ ఐక్యత 
కన్జర్వేటివ్‌ పార్టీ అంతర్గత విభేదాలతో కొట్టుమిట్టాడుతోంది. టోరీ సభ్యుల మధ్య ఐక్యత కాగడా వేసినా కనిపించడం లేదు. కన్జర్వేటివ్‌ పార్టీ అధ్యక్షుడిగా పార్టీని ఒక్కతాటిపైకి తీసుకురావల్సి ఉంది. మన పార్టీ మన దేశం ఐక్యంగా ఉండాలని ఇప్పటికే రిషి నినదిస్తున్నారు. 

వలసవిధానం 
బ్రిటన్‌ అక్రమ వలసలతో సతమతమవుతోంది. నాటు పడవల్లో యూకే తీరానికి ఈ ఏడాది 30వేల మందికి పైగా చేరుకున్నారని అంచనా.  ఈ నేపథ్యంలో వలసలపై కఠిన ఆంక్షలు విధిస్తానని ఎన్నికల ప్రచారంలోనే రిషి చెబుతూ వచ్చారు. ప్రతీ ఏడాది వచ్చే శరణార్థుల సంఖ్యపై పరిమితులు విధించాలని యోచిస్తున్నారు. అక్రమంగా వచ్చే వారిని పర్యవేక్షించి వారిని నిర్బంధించడానికి అధికారులకు అదనపు బాధ్యతలు ఇవ్వానికి ఒక ప్రణాళికన తీసుకురావాలని యోచిస్తున్నారు.

సమ్మెలు  
రాబోయే రోజుల్లో బ్రిటన్‌లో చాలా వర్గాలు సమ్మెకు దిగనున్నాయి. వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత, పనిచేసే ప్రాంతంలో పరిస్థితులపై రైలు యూనియన్, సమ్మె నోటీసు ఇచ్చింది. క్రిస్మస్‌కు ముందు దేశంలోని 150 యూనివర్సిటీల్లో 70 వేల మంది సమ్మెకు దిగనున్నారు.
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 
చదవండి: పాలించడమెలాగోచూపిస్తా

మరిన్ని వార్తలు