15వ శతాబ్దపు నిర్మాణం.. పుర్రెలతో గోడ

15 Dec, 2020 16:19 IST|Sakshi

మెక్సికోలో వెలుగు చూసిన నిర్మాణం

నరబలిగా భావిస్తోన్న శాస్త్రవేత్తలు

మెక్సికో సిటీ: సాధారణంగా రాతి గోడలు, ఇటుక గోడలు.. చివరకు కర్ర, సీసలతో నిర్మించిన గోడల గురించి విన్నాం.. చూశాం. కానీ పుర్రెలతో నిర్మించిన గోడ గురించి ఎప్పుడైనా విన్నారా... లేదు కదా. అయితే ఇది చదవండి. మెక్సికోలో 15వ శతాబ‍్దానికి చెందిన ఓ పురాతన గోడ బయటపడింది. దాన్ని చూసి పురాతత్వ శాస్త్రవేత్తలు షాకయ్యారు. ఎందుకుంటే ఈ గోడలో వరుసగా పుర్రెలు ఉన్నాయి. వీటిలో ఆడ, మగతో పాటు చిన్నారుల పుర్రెలను కూడా గుర్తించారు శాస్త్రవేత్తలు. దేవతా పూజ సందర్భంగా వీరందరిని బలి ఇచ్చి ఉంటారని నిపుణులు భావిస్తున్నారు. ఇక వీరిలో ఎక్కువ మంది శత్రు సైనికులు అయి ఉంటారని అంచనా వేస్తున్నారు. తల నిర్మాణం, పళ్ల సైజు ఆధారంగా ఈ పుర్రెల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక ఈ గోడ 2017లోనే బయటపడిందని.. గతంలో కొన్ని పుర్రెలని గుర్తించగా.. తాజాగా మరో 114 పుర్రెలు వెలుగులోకి వచ్చినట్లు ఆర్కియాలజిస్ట్‌లు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 600 వందల పుర్రెలు బయటపడ్డాయని తెలిపారు. (మిస్టరీ: వెలుగులోకి వచ్చిన రహస్య బీచ్‌)

ఇక అజ్టెక్‌ సామ్రాజ్యాధిపతి తన ప్రత్యర్థులకు హెచ్చరికగా ఈ గోడ నిర్మణాన్ని చేపట్టి ఉండవచ్చని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. స్పానిష్‌ ఆక్రమణదారులు 1521లో అజ్టెక్‌ సామ్రాజ్యాన్ని కూలదోశారు. ఇక గోడ నిర్మాణంలో వెలుగు చూసిన పుర్రెల్లో ఎక్కువ భాగం శత్రు సైనికులవి కాగా.. మరి కొన్ని సాధారణ ప్రజలవి అయి ఉండవచ్చని.. వీరందరిని దేవుడికి బలి ఇచ్చి ఉంటారని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే వీరిలో శత్రు సైనికులు ఎవరో.. సామాన్యులు ఎవరో గుర్తించడం కష్టం అంటున్నారు. ఇక ఈ గోడని 15వ శతాబ్దం చివర్లో నిర్మించి ఉంటారని భావిస్తున్నారు. ఇది ఆధునిక మెక్సికో నగరంలోని చారిత్రాత్మక జిల్లా అజ్టెక్ రాజధాని టెనోచ్టిట్లాన్ ప్రధాన ఆలయాలలో ఒకటైన టెంప్లో మేయర్ ప్రాంతంలో ఉంది. ఇక ఇది దేశంలోని ముఖ్యమైన పురావస్తు ఆవిష్కరణల్లో ఒకటిగా నిలుస్తుందన్నారు శాస్త్రవేత్తలు. "టెంప్లో మేయర్‌ అడుగడుగునా, మమ్మల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంది" అని కల్చరల్‌ మినిస్టర్‌ అలెజాండ్రా ఫ్రాస్టో ఒక ప్రకటనలో తెలిపారు. (చదవండి: ఇలాంటి అద్భుతాలు అరుదుగా జ‌రుగుతాయి)

"హ్యూయి జొంపంట్లీ, ఇటీవలి సంవత్సరాలలో మన దేశంలో అత్యంత ఆకర్షణీయమైన పురావస్తు పరిశోధనలలో ఒకటి. మీసోఅమెరికాలో వెలుగు చూసిన మానవ త్యాగం విశ్వం నిరంతర ఉనికిని నిర్ధారించే మార్గంగా భావించబడింది" అని ప్రకటనలో తెలిపారు. అందువల్ల నిపుణులు ఈ టవర్‌ను "మరణం కాకుండా జీవిత భవనం" గా భావిస్తున్నట్లు వెల్లడించారు.

మరిన్ని వార్తలు