మగవారి కొంపముంచుతున్న కెమికల్స్, ‌ఇలాగైతే కష్టమే!

20 Mar, 2021 04:26 IST|Sakshi

వాషింగ్టన్‌: ప్రపంచవ్యాప్తంగా మానవజాతిలో ఫలదీకరణ సామర్ధ్యం క్రమంగా తగ్గిపోతోందా? అవునంటున్నారు షన్నా స్వాన్‌ అనే ఎన్విరానమెంటల్‌ ఎమిడమాలజిస్టు. ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న పలు రకాల రసాయనాలు క్రమంగా మగవాళ్లలో వీర్యకణాల సంఖ్య తగ్గేందుకు, అంగ పరిమాణం కుంచించుకుపోయేందుకు కారణమవుతున్నాయని హెచ్చరిస్తున్నారు. కౌంట్‌డౌన్‌ పేరిట తాజాగా విడుదల చేసిన పుస్తకం ప్రకారం మనుషుల్లో వీర్యకణాల సంఖ్య 1973తో పోలిస్తే ప్రస్తుతం 60 శాతం మేర తగ్గిందని, ఇదే తరహా కొనసాగితే 2045 నాటికి స్పెర్మ్‌కౌంట్‌ జీరోకు చేరవచ్చని చెప్పారు.

ఇదే నిజమైతే భవిష్యత్‌లో మానవ ప్రత్యుత్పత్తే ఉండదని హెచ్చరించారు. ఈ విపత్తుకు కారణమైన రసాయనాలు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తున్నాయని, రోజూవారీ ఫుడ్‌ర్యాపింగ్స్‌ మొదలు, ప్లాస్టిక్‌ కంటైనర్ల వరకు వాటర్‌ప్రూఫ్‌ బట్టల నుంచి రోజూవారీ డియోడరెంట్లు, సబ్బుల వరకు అన్ని చోట్ల ఈ రసాయనాల జాడ ఉందని వివరించారు. వీటిలో పీఎఫ్‌ఏఎస్‌గా పిలిచే ఫరెవర్‌ కెమికల్స్‌ ఎప్పటికీ ప్రకృతిలో బ్రేక్‌డౌన్‌ కావని, ఇవి శరీరంలో పర్మినెంట్‌గా ఉంటాయని చెప్పారు. ఇవి శరీరంలో పేరుకుపోయేకొద్దీ హార్మోన్ల అసమతుల్యత పెరుగుతుందన్నారు.  

కెమికల్‌ ఇండస్ట్రీ ల్యాబీయింగ్‌ 
పీఎఫ్‌ఏఎస్‌ కెమికల్స్‌పై ఆయాదేశాలు స్పందించే తీరులో వ్యత్యాసాలున్నాయని, కొన్ని దేశాల్లో వీటిని పూర్తిగా నిషేధిస్తే, కొన్ని చోట్ల పరిమితంగా వాడుతున్నారని, కొన్ని చోట్ల ఎలాంటి నియంత్రణా లేదని స్వాన్‌ వివరించారు. వీటిని ప్రపంచవ్యాప్తంగా నిషేధించకుండా కెమికల్‌ ఇండస్ట్రీ ల్యాబీలు అడ్డుకుంటున్నాయని విమర్శించారు. రసాయనాల ప్రభావం మహిళల్లో సైతం ఫెర్టిలిటీపై పెరిగిందని స్వాన్‌ చెప్పారు.

ప్రస్తుత మహిళ తన ముత్తవ్వతో పోలిస్తే 35వ ఏట గర్భం దాల్చే శక్తి తగ్గిందన్నారు. అలాగే ఒక మగవాడి వీర్యకణాలు అతడి తాతతో పోలిస్తే సగమయ్యాయన్నారు. ఇది మానవాళి అంతానికి దారి తీసే విపత్తని చెప్పారు. కేవలం స్పెర్మ్‌ కౌంట్‌ తగ్గడమే కాకుండా ఈ కెమికల్స్‌ కారణంగా మగవారి అంగ పరిమాణం, వృషణాల్లో ఘనపరిమాణం కూడా తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా దేశాలు మేలుకొని ఈ కెమికల్‌ గండాన్ని ఎదుర్కోవాలని సూచించారు. 

మరిన్ని వార్తలు