కమలతో కలిసే 2024లో పోటీ!

21 Jan, 2022 04:39 IST|Sakshi

ప్రకటించిన యూఎస్‌ అధ్యక్షుడు బైడెన్‌

వాషింగ్టన్‌: వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌తో కలిసే పోటీ చేస్తానని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ప్రకటించారు. కమల పనితీరుపై ఆయన ప్రశంసలు కురిపించారు. 2024లో తాను అధ్యక్ష పదవికి, కమల ఉపాధ్యక్ష పదవికి కలిసే పోటీ చేస్తామన్నారు. కమల పనితీరుపై ఇటీవల కాలంలో మీడియాలో నెగెటివ్‌ కథనాలు వస్తున్న నేపథ్యంలో బైడెన్‌ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

రాబోయే ఎన్నికల్లో డెమొక్రాట్‌ టికెట్‌పై పోటీచేస్తారా? అన్న ప్రశ్నకు ఇప్పుడే ఏమీ చెప్పలేనని బుధవారం కమలా హారిస్‌ చెప్పిన సంగతి తెలిసిందే! దీంతో ఆమె మరోమారు బరిలోకి దిగకపోవచ్చన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే బైడెన్‌ తాజా ధ్రువీకరణతో కమల బరిలో ఉంటుందని స్పష్టమైంది. 2024కు బైడెన్‌కు 81 సంవత్సరాలు వస్తాయి. ఆ వయసులో ఆయన మరోమారు అధ్యక్ష పదవికి పోటీ చేయడంపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

అలాగే బైడెన్, కమల మధ్య సంబంధాలు కూడా ఇటీవల కాలంలో కొంత మసకబారినట్లు వార్తలున్నాయి. తన సామర్ధ్యాన్ని పార్టీ పూర్తిగా ఉపయోగించుకోవడం లేదని, క్లిష్ట విషయాల్లో తనను బలిపశువును చేస్తున్నారని కమల భావిస్తున్నట్లు కొన్ని వర్గాలు తెలిపాయి. కానీ బహిరంగంగా మాత్రం వీరిద్దరూ ఒకరిపై ఒకరు ప్రశంసలు గుప్పించుకుంటూనే ఉన్నారు. ఉక్రెయిన్‌తో పూర్తి స్ధాయి యుద్ధానికి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సాహసించకపోవచ్చని బైడెన్‌ అభిప్రాయపడ్డారు. అదే జరిగితే పుతిన్‌ తగిన మూల్యం చెల్లించాల్సివస్తుందని హెచ్చరించారు. అయితే ఏదో రూపంలో రష్యా ఉక్రయిన్‌పై చర్యలకు ఉపక్రమించవచ్చని ఆయన అంచనా వేశారు.

మరిన్ని వార్తలు