కరోనా వైరస్ : చైనా గుడ్‌న్యూస్‌

1 Jan, 2021 16:49 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్‌ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన శుభ తరుణంలోనే మరో శుభవార్తను చైనా వైద్యులు ప్రకటించడం విశేషం. ‘లింఫోమస్‌ క్యాన్సర్‌ (శరీర గ్రంధుల్లో ట్యూమర్లు రావడం)’ చికిత్స కోసం దశాబ్దంకు పైగా ఉపయోగిస్తున్న ‘ప్రలెట్రెక్సేట్‌’ మందుతో కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కోవచ్చని తమ అధ్యయనంలో తేలినట్లు చైనాలోని ‘షెంజెన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ’కి చెందిన డాక్టర్‌ హైపింగ్‌ జంగ్‌ నాయకత్వంలోని బందం ఈ మందుపై అధ్యయనం జరిపింది.

కరోనా వైరస్‌ బారిన పడిన వారికి వైరస్‌ నిరోధక చికిత్సలో భాగంగా ఇస్తోన్న ‘రెంమ్డేసివిర్‌’ మందుకన్న ‘ప్రలెట్రెక్సేట్‌’ మందుకన్నా ఎన్నో రెట్లు బాగా పని చేస్తోందని చైనా వైద్య బందం పేర్కొంది. అయితే ఈ మందు వల్ల అలసట, అల్సర్లు రావడం, కడుపులో మంట, వికారం లాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉన్నాయని, వాటిని తగ్గించేందుకు వీలుందని, ఆ దిశగా ప్రయత్నాలు వెంటనే చేపట్టాల్సిన అవసరం ఉందని వైద్య బందం చెప్పింది. ఈ క్యాన్సర్‌ మందుకు 2009లోనే అమెరికాలోని ‘ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌’ అనుమతి ఇచ్చింది. 

వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినప్పటికీ అది అందరికి ఇచ్చేలోగో ఎన్నో కోట్ల మంది ప్రజల కరోనా వైరస్‌ బారిన పడే అవకాశం ఉన్నందున, ఇప్పటికే బారిన పడిన వారికి చికిత్స అందించాల్సిన అవసరం ఉన్నందున ప్రత్యామ్నాయ చికిత్స మందులను ఎప్పటికప్పుడు కనుగొనాల్సిన అవసరం ఎంతైనా ఉందని డాక్టర్‌ హైపింగ్‌ జంగ్‌ వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు