ట్రంప్‌ను ఇరకాటంలో పెట్టే వీడియో

18 Sep, 2020 11:38 IST|Sakshi

వాషింగ్టన్‌: అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న వేళ డొనాల్డ్‌ ట్రంప్‌ను ఇరుకునపెట్టే వీడియో ఒకటి ప్రస్తుతం తెగ వైరలవుతోంది. కరోనా విషయంలో ట్రంప్‌ ఎలా స్పందించాడో ఈ వీడియో తెలుపుతుంది. దీనిలో వైట్‌హౌస్‌ మాజీ సహాయకురాలు ట్రంప్‌పై విమర్శలు కురిపించారు. వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్‌కు సహాయకురాలిగా ఉన్న ఒలివియా ట్రాయ్.. పెన్స్ నాయకత్వం వహించే వైట్ హౌస్ కరోనా వైరస్ టాస్క్‌ఫోర్స్‌కు అగ్ర నిర్వాహకురాలిగా పనిచేశారు. ఇక ఈ వీడియోలో ట్రాయ్‌ ‘నిజం.. వాస్తవానికి అధ్యక్షుడు తన గురించి తప్ప ఇతరుల గురించి ఆలోచించడు. కరోనా వైరస్‌ను అతడు సీరియస్‌గా తీసుకోలేదు. అందుకే దాని వ్యాప్తిని, మరణాల సంఖ్యని తగ్గించలేకపోయాడు. పైగా ‘కరోనా చాలా మంచిది.. దాని వల్ల ఎంతో మేలు జరగింది. అసహ్యకరమైన వ్యక్తులకు కరచాలనం చేయాల్సిన పరిస్థితి నుంచి తప్పించింది’ అన్నాడు. కానీ ఇప్పుడు అదే అసహ్యకరమైన జనాలు ఆయన ర్యాలీల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికైనా అతడి నిజస్వరూపం తెలుసుకొండి. తనకు ఓటు వేయకండి. జో బైడెన్‌ని గెలిపించండి’ అన్నారు ట్రాయ్‌. (చదవండి: ట్రంప్‌కు కలిసొచ్చిన కశ్మీర్‌)
 

అయితే ఈ వ్యాఖ్యలను ట్రంప్‌ కొట్టిపారేశారు. తాను ఎప్పుడు ట్రాయ్‌ని కలవలేదని తెలిపారు. పైగా ఆమె వైట్‌హౌస్‌ నుంచి వెళ్లేటప్పుడు తన పరిపాలనను ప్రశంసిస్తూ లేఖ రాసిందన్నారు. వైట్ హౌస్ విడుదల చేసిన ఆ లేఖలో, కరోనావైరస్ టాస్క్‌ఫోర్స్‌లో పనిచేయడం “సంపూర్ణ గౌరవం” అని ట్రాయ్ పేర్కొన్నారు. అయితే ఇందులో ట్రంప్‌ని, పెన్స్‌ని ప్రశంసించిన దాఖలాలు లేవు.

మరిన్ని వార్తలు