వర్షంలో తడిస్తే నా జుట్టు పాడవుతుంది: ట్రంప్‌

4 Sep, 2020 14:35 IST|Sakshi

మొదటి ప్రపంచ యుద్ధ వీరులపై ట్రంప్‌ అనుచిత వ్యాఖ్యలు

ఓడిపోయినవారిని, పిరికిపందలను నేను చూడను

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు. అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఇప్పడు ఆ నోటి దురుసు వ్యాఖ్యలే ఆయనను ఇబ్బందుల్లోకి నెట్టాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోయిన అమెరికా నౌకాదళ సైనికులను ఫ్రాన్స్‌లోని డబ్ల్యూడబ్ల్యూఐ స్మశానవాటికలో ఖననం చేశారు. ఆ సమాధులను చూడటానికి ట్రంప్‌ ఇష్టపడలేదని సమాచారం. అంతేకాక ‘ఓడిపోయిన వారు.. పిరికి పందలను నేను చూడనంటూ’ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అట్లాంటిక్‌ పత్రిక గురువారం ఒక నివేదిక వెల్లడించింది. మ్యాగజైన్ ఎడిటర్-ఇన్-చీఫ్ జెఫ్రీ గోల్డ్‌బెర్గ్ ఈ నివేదికను ప్రచురించారు. దాని ప్రకారం.. 2018 లో పారిస్ సమీపంలోని ఐస్నే-మార్న్ అమెరికన్ స్మశానవాటికను సందర్శించడానికి ట్రంప్ నిరాకరించారని, ఎందుకంటే ‘వర్షంలో తన జుట్టు చెడిపోతుందని ఆయన భయపడ్డాడు’ అని  అధికారిక వివరణ. కానీ ట్రంప్‌ సహాయకులు మాత్రం వాతావరణం బాగాలేదని.. అందుకే హెలికాప్టర్‌ అక్కడికి వెళ్లలేదని తెలిపారు. 

సీనియర్‌ అధికారులతో మాట్లాడి తన పర్యటన వివరాలు తెలుసుకున్న ట్రంప్‌ ‘నేను ఎందుకు సశ్మాన వాటికను సందర్శించాలి. అక్కడ అంతా ఓడిపోయిన వారే ఉంటారు’ అని వ్యాఖ్యానించినట్లు ఆర్టికల్‌ పేర్కొన్నది. ఇదే పర్యటనకు సంబంధించి మరో సంభాషణలో ట్రంప్‌ చనిపోయిన 1,800 మంది నౌకాదళ వీరులను ఓడిపోయారు.. పిరికి వాళ్లు అని విమర్శించినట్లు ఆర్టికల్‌ వెల్లడించింది. అయితే ఈ కథనాన్ని ట్రంప్‌ టీం ఖండించింది. ఈ సందర్భంగా చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మెడోస్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘అధ్యక్షుడు ఈ కథనాన్ని చదివి ఎంతో బాధపడ్డారు. తప్పడు వార్తలను తీవ్రంగా ఖండించారు’ అని తెలిపారు. వైట్‌ హౌస్‌ కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌ అలిస్సా ఫరా ఈ ఆరోపణలు అభ్యంతరకరమైనవి.. చాలా తప్పుడువి అన్నారు. అంతేకాక ట్రంప్‌ ప్రచార ప్రతికా కార్యదర్శి హోగన్‌ గిడ్లీ మాట్లాడుతూ.. ‘నేను అప్పుడు అధ్యక్షుడితో పాటే ఉన్నాను. ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇవి పూర్తిగా పచ్చి అబద్దాలు. పిరికిపంద వ్యాఖ్యలు. కనుకనే వారు పేర్లు వెల్లడించలేదు. ఎందుకంటే ఈ వ్యాఖ్యలు ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయో వారికి తెలుసు’ అంటూ గిడ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కానీ కొందరు విమర్శకులు మాత్రం ఈ కథనాన్ని సమర్థిస్తున్నారు. ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు దివంగత సెనేటర్‌ జాన్‌ మెక్కెయిన్‌ గురించే చేసి ఉంటాడని అభిప్రాయపడుతున్నారు. జాన్‌ వియాత్నంలో పట్టుబడ్డాడు. అతడిని యుద్ధ వీరుడిగా పరిగణిస్తారు. 2016 ఎన్నికల ప్రచార సమయంలో కూడా ట్రంప్‌ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘జాన్‌ యుద్ధ వీరుడు కాదు. పట్టుబడ్డ వ్యక్తిని యుద్ధవీరుడు అనకూడదు. శత్రువుకు చిక్కని వారినే నేను ఇష్టపడతాను’ అంటూ వ్యాఖ్యానించారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో1918 లో పారిస్ వైపు జర్మన్ పురోగతిని నిలిపివేసి, బెల్లీ వుడ్ వద్ద జరిగిన యుద్ధంలో సుమారు 1,800 అమెరికా నౌకాదళ సైనికులు మరణించారు. అట్లాంటిక్ ప్రకారం, ట్రంప్ తన ఫ్రాన్స్ పర్యటనలో  ‘ఈ యుద్ధంలో మంచి వ్యక్తులు ఎవరు.. అసలు యునైటెడ్ స్టేట్స్ మిత్రరాజ్యాల సహాయానికి ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు’ అని తన సహాయకులతో వ్యాఖ్యానించినట్లు  తెలిస్తోంది. 

మరిన్ని వార్తలు