టార్గెట్‌ బైడెన్‌ వయా చైనా!

9 Nov, 2020 13:18 IST|Sakshi

న్యూయార్క్‌ : అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ ఎన్నిక లాంఛనమే అయినా ఓటమిని అంగీకరించని డొనాల్డ్‌ ట్రంప్‌ బైడెన్‌ను ఇరకాటంలోకి నెట్టేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని నిపుణులు అంచనా వేస్తున్నారు. వైట్‌హౌస్‌లో మరో రెండు నెలలు ఉండనున్న ట్రంప్‌ పదవి నుంచి దిగిపోయే ముందు చైనాకు చుక్కలు చూపుతారని, ఇది బైడెన్‌ను ఆత్మరక్షణలోకి పడవేసేందుకేనని చెబుతున్నారు. కరోనా వైరస్‌ పుట్టుక, విస్తృత వ్యాప్తి, అమెరికాలో ఆర్థిక మాంద్యానికి చైనాను నిందిస్తూ వచ్చిన ట్రంప్‌ ఇక డ్రాగన్‌ టార్గెట్‌గా చెలరేగుతారని ఓ నివేదిక స్పష్టం చేసింది.

చైనాతో అమెరికా సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్న క్రమంలో బైడెన్‌ రాకతో ద్వైపాక్షిక బంధం బలపడుతుందని భావిస్తున్న క్రమంలో సమస్యను మరింత జటిలం చేసేందుకు ట్రంప్‌ దూకుడు కనబరుస్తారని విదేశీ వ్యవహారాల నిపుణులు జెఫ్‌ మూన్‌ వ్యాఖ్యానించారు. చైనాను ఇబ్బందులకు గురిచేసేలా తైవాన్‌ అంశాన్ని ట్రంప్‌ మరోసారి తెరపైకి తెస్తారని భావిస్తున్నారు. చైనా అధికారులకు వీసాల నిలిపివేతతో పాటు 2022లో బీజింగ్‌లో జరిగే ఒలింపిక్స్‌లో అమెరికన్‌ అథ్లెట్లు పాల్గొనకుండా నిలువరించవచ్చని చెబుతున్నారు. టిక్‌టాక్‌, వీచాట్‌లపై నిషేధం అనంతరం మరిన్ని చైనా యాప్‌లపై ట్రంప్‌ నిషేధం విధించే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. చదవండి : ట్రంప్‌ మెలానియా విడాకులు?


బైడెన్‌కు చిక్కులు
చైనాతో సంబంధాలను చక్కదిద్దేందుకు పూనుకునే బైడెన్‌కు ఇబ్బందులు కలిగించేందుకే ట్రంప్‌ చైనాకు చెక్‌ పెట్టే చర్యలను ముమ్మరం చేస్తారని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనాకు వ్యతిరేకంగా ట్రంప్‌ ప్రభుత్వం చేపట్టిన విధానాలను తప్పక కొనసాగించాల్సిన పరిస్థితిని బైడెన్‌ ముందుంచేలా ట్రంప్‌ వ్యవహరిస్తున్నారని కార్నెల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సరా క్రెప్స్‌ పేర్కొన్నారు. మరోవైపు చైనా పట్ల 73 శాతం​ అమెరికన్లలో వ్యతిరేకత ప్రబలిందని ప్యూ రీసెర్చి సెంటర్‌ పరిశోధన నేపథ్యంలో డ్రాగన్‌తో సంబంధాల పట్ల బైడెన్‌ ఎలాంటి విధానాలను అవలంభిస్తారనేది ఆసక్తికరంగా మారింది. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు