ట్రంప్‌ అరెస్టుకు రంగం సిద్ధం?.. స్వయంగా ప్రకటించిన మాజీ అధ్యక్షుడు

18 Mar, 2023 20:35 IST|Sakshi

న్యూయార్క్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఓ పో* స్టార్‌కు భారీగా నగదు ఇచ్చి.. ఒప్పందం చేసుకున్నాడనే నేరారోపణలకు గానూ ఆయన్ని అరెస్ట్‌ చేసే అవకాశం ఉందట. ఈ మేరకు మాన్‌హట్టన్‌ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం నుంచి స్పష్టమైన సంకేతాలు అందినట్లు ట్రంప్‌ స్వయంగా వెల్లడించారు. 

వచ్చే వారంలో మంగళవారం బహుశా తాను అరెస్ట్‌ కావొచ్చని ట్రంప్‌ తన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ సోషల్‌ ట్రూత్‌ ద్వారా   వెల్లడించారు. 2016 ఎన్నికలకు ముందు ఓ పో* స్టార్‌కు భారీగా డబ్బులు ఇచ్చి ఒప్పందం చేసుకున్నారనే అభియోగాలపై ఇప్పటికే దర్యాప్తు సంస్థల విచారణ సాగుతోంది అక్కడ. ఈ నేపథ్యంలో ట్రంప్‌పై నేరారోపణలు నమోదు చేసి.. అరెస్ట్‌ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇక తన అరెస్ట్‌ సంకేతాల నేపథ్యంలో మద్దతుదారులంతా నిరసనలకు సిద్ధం కావాలని పిలుపు ఇచ్చారు ట్రంప్‌. ఈ మేరకు మాన్‌హట్టన్‌ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం తనకు సమాచారం లీక్‌ అయ్యిందని ఆయన చెప్పుకొచ్చారు. 

ట్రంప్‌ తనతో ఉన్న సంబంధాన్ని బహిరంగపర్చకుండా ఉండేందుకు..  స్టార్మీ డేనియల్స్ అలియాస్‌ స్టెఫానీ క్లిఫార్డ్‌ అనే పో* స్టార్‌తో ఒప్పందం చేసుకున్నాడు. అందుకుగానూ ఆమెకు లక్షా 30 వేల డాలర్లు ముట్టజెప్పాడు ట్రంప్‌. ఇది 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు జరిగింది. అయితే.. రెండేళ్ల తర్వాత ఆమె మీడియా ముందుకు వచ్చింది.  ట్రంప్‌తో తనకు శారీరక సంబంధం ఉందని, తమ మధ్య జరిగిన నాన్‌డిస్‌క్లోజర్‌ ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ లాస్‌ఏంజెల్స్‌ కోర్టులో దావా వేసిందామె. అయితే.. ఈ కేసులో ట్రంప్‌పై నేరారోపణలు మోపాలా వద్దా అని ప్రాసిక్యూటర్లు ఆలోచిస్తున్నట్లు సమాచారం. 

ఈలోపే ఆ ఆరోపణలకు సంబంధించి 76 ఏళ్ల వయసున్న ట్రంప్‌ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు సంకేతాలు అందుతున్నాయి. అదే జరిగితే నేరారోపణలు ఎదుర్కొన్న మొట్టమొదటి అమెరికా మాజీ అధ్యక్షుడిగా ట్రంప్‌ చరిత్రకెక్కుతాడు. అదే జరిగితే అరెస్ట్‌ దాకా వెళ్లకుండా.. తన క్లయింట్‌ లొంగిపోతాడని ట్రంప్‌ తరపున న్యాయవాది చెబుతుండగా.. ట్రంప్‌ మాత్రం సదరు స్టార్‌తో ఎఫైర్‌ను అంగీకరించడం లేదు.

ఇదీ చదవండి:  ఇలా కోర్టుకు వెళ్లగానే.. పదివేల మంది పోలీసుల దాడి!

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు