వెళ్లేముందు కూడా ‘ట్రంప్‌’రితనం

20 Jan, 2021 13:06 IST|Sakshi

వాషింగ్టన్‌: నాలుగేళ్ల పాటు అమెరికా అధ్యక్షుడిగా హోదాలో పని చేసిన డొనాల్డ్‌ ట్రంప్‌ చివరివరకు టెంపరితనంతోనే ఉన్నారు. అధ్యక్షుడిగా ఉన్న చివరి రోజు కూడా సంప్రదాయాలు పాటించకుండా తన వ్యవహార శైలిలోనే నడుచుకున్నారు. వాస్తవంగా కొత్తగా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయబోయే కార్యక్రమంలో అధ్యక్ష పదవిని వీడే వ్యక్తి పాల్గొనాల్సి ఉంది. అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న వారికి అభినందనలు తెలపాలి. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారని ఒక ప్రకటన విడుదల చేయాలి. కానీ అలాంటివేమీ లేకుండా చివరి వరకు జో బైడెన్‌ అధ్యక్షుడిగా ఎన్నికైనట్టు ఎక్కడా ధ్రువీకరించలేదు. కొత్తగా బాధ్యతలు స్వీకరించే బృందానికి శుభాకాంక్షలు అని చెప్పారు.
శతాబ్దంన్నర సంప్రదాయం తూచ్‌
కొత్తగా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించే వ్యక్తికి పాత అధ్యక్షుడు స్వాగతం చెబుతూ ప్రమాణ కార్యక్రమానికి హాజరవ్వడం సంప్రదాయం. అయితే బైడెన్‌కు తాను స్వాగతం చెప్పే ప్రసక్తేలేదని గతంలోనే ట్రంప్‌ ప్రకటించారు. 150 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయానికి ట్రంప్‌ తూట్లు పొడిచారు. అయితే తన ప్రమాణానికి ట్రంప్‌ హాజరుకాకపోవడమే మంచిదని బైడెన్‌ తెలిపారు. 1869లో అప్పటి అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్‌ తదుపరి అధ్యక్షుడు ఎస్‌ గ్రాంట్‌ ప్రమాణానికి హాజరుకాలేదు. ఇప్పుడు ట్రంప్‌ ఆ జాబితాలో చేరిపోయాడు.

మరిన్ని వార్తలు