-

అధికార మార్పిడికి ట్రంప్‌ మోకాలడ్డు!

11 Nov, 2020 03:49 IST|Sakshi

అమెరికాలో ఓటింగ్‌ అక్రమాలపై విచారణకు అటార్నీ జనరల్‌ అనుమతి

వాషింగ్టన్ ‌: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ముగిసి కొత్త అధ్యక్షుడి ఎన్నిక పూర్తయినా ఆ విషయాన్ని అంగీకరించేందుకు ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌ నిరాకరిస్తున్నారు. కొత్తగా పగ్గాలు చేపట్టాల్సిన డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ను అడ్డుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎన్నికల్లో మోసాలు జరిగాయని ట్రంప్‌ ఆరోపణలు గుప్పించారు. అటార్నీ జనరల్‌ విలియం బార్‌ ఓటింగ్‌ అక్రమాలపై విచారణకు న్యాయశాఖకు అనుమతి ఇవ్వడం, అధికార మార్పిడికి సంబంధించి బైడెన్‌ బృందానికి సహకరించకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డుకోవడం తాజా పరిణామాలు.

ఓటమిని జీర్ణించుకోలేని ట్రంప్‌ ఒకవైపు పెంటగన్‌ అధ్యక్షుడిని తప్పించారు. కరోనా కట్టడి కోసం బైడెన్‌ ఏర్పాటు చేయదలచుకున్న నిపుణుల బృందానికి ప్రభుత్వ విభాగాల ద్వారా ట్రంప్‌ నో చెప్పించారు. ఎన్నికల్లో ఓటమిని హుందాగా అంగీకరించాలని పలువురు రిపబ్లికన్‌ సెనేటర్లు, మాజీ అధ్యక్షుడు జార్జ్‌ బుష్‌ తదితరులు ట్రంప్‌పై ఒత్తిడి తెచ్చినా ఫలితం శూన్యం. రిపబ్లికన్‌ పార్టీ ముఖ్యులు కొందరు ట్రంప్‌వైపే నిలబడ్డారు. పార్టీలో తనకు మద్దతుగా నిలవని వారిని పదవుల నుంచి తప్పించేందుకు ట్రంప్‌ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే పెంటగన్‌ చీఫ్, రక్షణ మంత్రి మార్క్‌ ఎస్పర్‌ను పదవి నుంచి తొలగించగా, ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ క్రిస్టోఫర్, సీఐఏ అధ్యక్షుడు గినా హాస్పల్, సాంక్రమిక వ్యాధుల నిపుణుడు డాక్టర్‌ ఆంథొనీ ఫాసీలను ఇంటిదారి పట్టించే అవకాశముందని తెలుస్తోంది. తన మద్దతుదారులను సంఘటితంగా ఉంచేందుకు ట్రంప్‌ ఎన్నికల తరహా ర్యాలీలు నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులను ముందుంచి ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ప్రచారం చేయాలన్నది ట్రంప్‌ ఆలోచన అని, తాను అజ్ఞాతంలో ఉండే అవకాశముందని సమాచారం.  

మరిన్ని వార్తలు