ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని 24 గంటల్లో ఆపేస్తా.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు..

27 Jan, 2023 16:16 IST|Sakshi

వాషింగ్టన్‌: దాదాపు 11 నెలలుగా ఉక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇంకా ఉద్రిక్తతలు చల్లారడంలేదు. రష్యా క్షిపణులతో విరుచుకుపడుతుండగా.. ఉక్రెయిన్ దీటుగా బదులిస్తోంది. ఈ రెండు దేశాలు యుద్ధాన్ని ఆపాలని ప్రపంచ దేశాలు కోరినా ఫలితం లేకుండాపోయింది.

అయితే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం తాను అధికారంలో ఉండి ఉంటే ఈ యుద్ధాన్ని 24 గంటల్లోనే ఆపేవాడినని పేర్కొన్నారు. చర్చల ద్వారా సమస్యను వెంటనే పరిష్కరించేవాడినని చెప్పుకొచ్చారు. ఇప్పటికి కూడా తాను అధ్యక్షుడినైతే చర్చల ద్వారా ఈ భయానక యుద్ధాన్ని 24 గంటల్లో ఆపేలా చేస్తానని పేర్కొన్నారు. ఈమేరకు ఆయన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫాం 'ట్రుత్ సోషల్‌'లో రాసుకొచ్చారు.

గతేడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రకు దిగింది. అప్పటినుంచి బాంబులు, క్షిపణులుతో కీవ్‌పై విరుచుకుపడుతోంది. మొదట్లో రష్యా దాడులకు తీవ్రంగా నష్టపోయిన ఉక్రెయిన్.. ఆ తర్వాత ధీటుగా బదులిస్తూ శత్రు దేశానికి సవాళ్లు విసురుతోంది. ప్రపంచదేశాలు కూడా ఉక్రెయిన్‌కు సంఘీభావంగా నిలిచి ఆర్థికంగా, ఆయుధాలపరంగా అండగా నిలుస్తున్నాయి.

అమెరికా, జర్మనీ వంటి దేశాలు కీవ్‌కు అధునాతన యుద్ధ ట్యాంకులు, ఆయుధ వ్యవస్థలను సమకూరుస్తున్నాయి. ఈ పరిణామాల కారణంగా రష్యా అణ్వాయుధాలతో దాడులు చేసే ప్రమాదం ఉందని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. తానుంటే 24 గంటల్లోనే యుద్ధాన్ని ఆపే వాడినని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు