మూడో ప్రపంచ యుద్ధంతో భూమిపై ఏమీ మిగలదు: ట్రంప్‌

10 Oct, 2022 11:51 IST|Sakshi

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌పై కొన్ని నెలలుగా సైనిక చర్య పేరుతో భీకర దాడులకు పాల్పడుతోంది రష్యా. అందుకు దీటుగా కీవ్‌ సేనలు బదులిస్తున్నారు.  వందల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ అంశంపై స్పందించారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌. తక్షణం శాంతియుతంగా యుద్ధానికి ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో శనివారం నిర్వహించిన ‘సేవ్‌ అమెరికా’ ర్యాలీలో మాట్లాడుతూ.. అణ్వాయుధాల వినియోగంపై హెచ్చరించారు. 

‘అజ్ఞానుల కారణంగా ఈ భూమిపై ఏమీ మిగలదు. ఉక్రెయిన్‌ యుద్ధానికి తక్షణ శాంతియుతంగా చర్చలు జరిపి ముగింపు పలకాలని మనమంతా డిమాండ్‌ చేయాలి. లేదా మూడో ప్రపంచ యుద్ధంతోనే ముగుస్తుంది. దాంతో మన భూమండలంపై ఏమీ మిగలదు.’ అని ప్రపంచాన్ని హెచ్చరించారు ట్రంప్‌. అణ్వాయుధాల వినియోగంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హెచ్చరికలు చేసిన తర్వాత ట్రంప్‌ ఈ మేరకు స‍్పందించటం సంచలనంగా మారింది.

క్యూబన్‌ మిసైల్స్‌తో ఏర్పాడిన సంక్షోభంతో 60 ఏళ్ల తర్వాత మళ్లీ న్యూక్లియర్‌ బాంబుల ముప్పు పొంచి ఉందంటూ వ్యాఖ్యానించారు బైడెన్‌. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అణ్వాయుధాల హెచ్చరికలు జోక్‌ కాదని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాల్సిన ‍అవసరం ఉందంటూ ప్రపంచానికి సూచించారు. గతంలోనూ ఇలాంటి హెచ్చరికలే చేశారు పలువురు ప్రపంచ నేతలు. వరుస హెచ్చరికల నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధం తప్పదనే భావనలు మొదలైనట్లు తెలుస్తోంది. 

ఇదీ చదవండి: Russia Ukraine War: పుతిన్‌ అణ్వాయుధ బెదిరింపులపై బైడెన్‌ సంచలన వ్యాఖ‍్యలు

మరిన్ని వార్తలు