Tsunami: అగ్నిపర్వతం బద్ధలుతో అలజడి.. ముందుకొస్తున్న మహాసముద్రం.. పలు దేశాల్లో సునామీ అలర్ట్‌

16 Jan, 2022 08:33 IST|Sakshi

పసిఫిక్‌ మహాసముద్రం దక్షిణ భాగంలో టోంగా దగ్గర అగ్నిపర్వతం భారీ శబ్ధంతో శనివారం బద్ధలైన సంగతి తెలిసిందే. ఆ ధాటికి భారీ ఎత్తున అలలు ఎగసి పడుతుండడంతో తీర ప్రాంతాలు అప్రమత్తం అవుతున్నాయి. చాలా చోట్ల సముద్ర జలాలు ముందుకు దూసుకురావడంతో.. అల్లకల్లోలం నెలకొంది.  


Tsunami Warning For Some Pacific Coastal Countries: ఈ పరిణామంతో టోంగాతో పాటు అమెరికన్‌ సమోవా, న్యూజిలాండ్‌, ఫిజీ, వనువాటు, చిలీ, ఆస్ట్రేలియా.. సునామీ హెచ్చరికలు జారీ చేశాయి. నాలుగు అడుగుల ఎత్తుతో అలలు ఎగసిపడగా.. టోంగా రాజధాని నుకువాలోఫా ప్రజలు వణికిపోయారు. భారీ శబ్ధంతో భూమీ కంపించడంతో పాటు సముద్రపు నీరు నగరంలోకి చొచ్చుకుని వచ్చిందని ఆస్ట్రేలియా బ్యూరో ఆఫ్‌ మెటియోరాలజీ ప్రకటించింది. టోంగా రాజు ప్యాలెస్‌ నుంచి ఇప్పటికే సురకక్షిత ప్రాంతానికి తరలిపోగా.. తన పౌరులను అప్రమత్తంగా ఉండాలంటూ పిలుపు ఇచ్చాడు. నష్టం వివరాలు అందాల్సి ఉంది. 

మరోవైపు అలలు ఎగసిపడే అవకాశం ఉన్నందున అమెరికా, జపాన్‌, సైతం ఇప్పుడు సునామీ హెచ్చరికలతో అప్రమత్తం అయ్యాయి. జపాన్‌ తీర ప్రాంతం వెంబడి 11 అడుగుల మేర అలలు ఎగసిపడే అవకాశం ఉందని భావిస్తోంది వాతావరణ సంస్థ. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచిస్తోంది. మరోవైపు అమామీ ఒషీమా ద్వీపంలోకి 1.2 మీటర్‌ ఎత్తుతో అలలు ఎగసిపడినట్లు తెలుస్తోంది. 

అమెరికా, కెనడా పశ్చిమ తీరం వెంట సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. కాలిఫోర్నియా, అలస్కా వెంట చిన్నపాటి వరదల దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. హవాయ్‌ అప్రమత్తం అయ్యింది. ఓరేగావ్‌ తీరం వెంట సముద్రపు అలలు ముందుకు వస్తున్నాయి.

వీడియో: టోంగా దగ్గర పేలిన అగ్నిపర్వతం

మరిన్ని వార్తలు