వీడియో: తుల్సీ గబ్బార్డ్ సంచలన ఆరోపణలు.. డెమొక్రటిక్‌ పార్టీకి గుడ్‌బై

12 Oct, 2022 07:55 IST|Sakshi
భారత ప్రధాని మోదీతో తుల్సీ గబ్బార్డ్‌(పాత చిత్రం)

వాషింగ్టన్‌: అమెరికా మాజీ అధ్యక్ష అభ్యర్థి, ఆ దేశ చట్ట సభ్యురాలు తుల్సీ(తులసి) గబ్బార్డ్‌ సంచలనానికి తెర లేపారు. డెమొక్రటిక్‌ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన ఆమె.. ఈ క్రమంలో పార్టీ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. డెమొక్రటిక్‌ పార్టీ దేశంలోని ప్రతీ అంశాన్ని జాతివివక్ష కోణంలోనే నడిపిస్తోందన్న ఆమె.. వీడియో సందేశంలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారామె. 

తుల్సీ గబ్బార్డ్‌.. అమెరికా చట్ట సభకు ఎన్నికైన తొలి హిందూ-అమెరికన్‌. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ కోసం యత్నించిన తొలి హిందువుగా(అత్యంత చిన్నవయస్కురాలిగా కూడా) తుల్సీ గబ్బార్డ్‌ చరిత్రకెక్కారు. అయితే ఆ తర్వాత వైదొలిగి జో బైడెన్‌ తరపున ప్రచారంలో పాల్గొన్నారు. ఇరవై ఏళ్లుగా డెమొక్రటిక్‌ పార్టీతో అనుబంధం ఉన్న ఆమె..  శ్వేతజాతీయులకు వ్యతిరేకంగా డెమొక్రటిక్‌ పార్టీ జాత్యహంకారం ప్రదర్శిస్తోందని తులసి గబ్బార్డ్‌ ఆరోపించారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో 30 నిమిషాల నిడివి ఉన్న వీడియోను పోస్ట్‌ చేశారామె. 

దేశ ప్రజల ప్రాథమిక స్వేచ్ఛను డెమొక్రటిక్‌ పార్టీ అణగదొక్కుతోందని, ప్రజల చేత,  ప్రజల కొరకు ప్రభుత్వం అనే సిద్ధాంతాన్నే తాను నమ్ముతున్నానని, కానీ, ఇప్పుడున్న డెమొక్రటిక్ పార్టీ ఈ విలువలకు కట్టుబడి లేదని ఆమె విమర్శించారు. ప్రజల విశ్వాసం, ఆధ్యాత్మికతకు డెమొక్రటిక్‌ పార్టీ శత్రువుగా మారింది. అమెరికా అణు యుద్ధంలోకి లాగుతోందని ఆరోపించారు. పార్టీ అవలంభిస్తున్న యాంటీ వైట్‌ రేసిజంను ఖండిస్తూ.. ఇకపై పార్టీలో సభ్యురాలిగా కొనసాగబోనని ఆమె ప్రకటించారు. ప్రస్తుతానికి తాను స్వతంత్రురాలినని ప్రకటించుకున్న ఆమె..  రిపబ్లికన్‌ పార్టీలో చేరతారా? మరేదైనా రాజకీయ వేదికను ఆశ్రయిస్తారా? అనే విషయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

 

41 ఏళ్ల వయసున్న తుల్సీ గబ్బార్డ్‌.. హవాయ్‌ స్టేట్‌హౌజ్‌కు ప్రతినిధిగా తన 21 ఏళ్ల వయసులోనే ఎంపికయ్యారు. హవాయ్‌ ఆర్మీ నేషనల్‌ గార్డు తరపున మెడికల్‌ యూనిట్‌లో ఇరాక్‌లో 2004-05 మధ్య, కువైట్‌లో 2008-09 మధ్య ఆమె విధులు నిర్వహించారు. లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలోనూ ఆమె పని చేశారు. 
 
అమెరికన్‌ సమోవాన్ ద్వీపమైన టుటులియాలో పుట్టి పెరిగిన గబ్బార్డ్‌.. సమోవాన్‌-యూరోపియన్‌ మూలాలు ఉన్న వ్యక్తి. యుక్తవయసులోనే ఆమె హిందూ మతాన్ని స్వీకరించారు. అందుకు గబ్బార్డ్‌ ముందర సంస్కృత పదం తులసి(తుల్సీ)ని చేర్చుకున్నారు. 2013 నుంచి 2021 మధ్య.. నాలుగు సార్లు యునైటెడ్‌ స్టేట్స్‌ హౌజ్‌ ఆఫ్‌ రెప్రెజెంటేటివ్‌గా ఆమె ఎన్నికయ్యారు. 

A post shared by Tulsi Gabbard (@tulsigabbard)

హిందుతత్వాన్ని పుణికిపుచ్చుకున్న తుల్సీ గబ్బార్డ్.. గౌడియ వైష్ణవాన్ని అనుసరిస్తున్నారు. తనను తాను కర్మ యోగిగా అభివర్ణించుకుంటారు. భగవద్గీతను నమ్మే ఆమె.. 2013లో ప్రమాణ సమయంలో భగవద్గీత మీద ప్రమాణం చేశారు. ఆ తర్వాత ఆ భగవద్గీత కాపీనే 2014లో అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీకి ఆమె అందించారు. 2002లో ఎడురాడో టమాయో అనే  వ్యక్తిని వివాహమాడిన ఆమె.. 2006లో విడాకులిచ్చారు. ఆపై 2015లో ఫ్రీలాన్స్‌ సినిమాటోగ్రాఫర్‌, ఎడిటర్‌ అబ్రహం విలియమ్స్‌ను శాస్త్రోతంగా వివాహం చేసుకున్నారు. గతంలో సొంత పార్టీకి చెందిన బరాక్‌ ఒబామా పైనా విమర్శలు గుప్పించిన ఆమె.. రిపబ్లికన్‌ పార్టీ సిద్ధాంతాలను కొన్నింటికి మద్దతు ప్రకటించడం గమనార్హం.

>
మరిన్ని వార్తలు