Turkey and Syria Earthquake: బాల్యం శిథిలం

15 Feb, 2023 05:17 IST|Sakshi

తుర్కియే, సిరియాలో 70 లక్షలకు పైగా పిల్లలపై ప్రభావం

యునిసెఫ్‌ అంచనాలు  

అమ్మ పొత్తిళ్లలో హాయిగా పడుకోవాల్సిన అభం శుభం తెలియని పసికందులు అందరినీ కోల్పోయి అనాథలుగా మారుతున్నారు. ఎందుకీ విపత్తు ముంచుకొచ్చిందో తెలీక నిలువ నీడ లేక ఎందుకు రోడ్లపైకొచ్చామో అర్థం కాక  బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. తుర్కియే, సిరియాల్లో సంభవించిన భారీ భూకంపం ఎందరో చిన్నారుల్ని అనాథల్ని చేసింది. వీరిలో చాలా మంది రోజుల పసికందులే. ఇప్పటికే అంతర్యుద్ధంతో అల్లాడిపోతున్న సిరియాలో భూకంపం పిల్లల నెత్తిన పిడుగుపాటులా మారింది.  ప్రకృతి వైపరీత్యాలు, అధికార కాంక్షతో మానవులు చేస్తున్న యుద్ధాలు చిన్నారులకు ఎలా శాపంగా మారుతున్నాయి..?

తుర్కియే భూకంపంలో శిథిలాల మధ్యే ఒక పసిపాప భూమ్మీదకొచ్చింది. బిడ్డకి జన్మనిచ్చిన ఆ తల్లి ప్రాణాలు కోల్పోవడంతో పుడుతూనే అనాథగా మారింది. అయా (అరబిక్‌ భాషలో మిరాకిల్‌) అని పేరు పెట్టి ప్రస్తుతానికి ఆస్పత్రి సిబ్బందే ఆ బిడ్డ ఆలనా పాలనా చూస్తున్నారు. ఈ రెండు దేశాల్లో సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉంటే ఎక్కువగా పిల్లలే శిథిలాల కింద నుంచి ప్రాణాలతో బయటకి వస్తున్నారు.

10 రోజుల నుంచి 14 ఏళ్ల వయసున్న వారి వరకూ ప్రతీ రోజూ ఎందరో పిల్లలు ప్రాణాలతో బయటకి వస్తున్నారు. వారంతా తల్లిదండ్రులు, బంధువుల్ని కోల్పోయి అనాథలుగా మారడం ఆందోళన కలిగిస్తోంది. ఈ చిన్నారులకు అండగా యునిసెఫ్‌ బృందం తుర్కియే చేరుకుంది. తుర్కియేలో 10 ప్రావిన్స్‌లలో 46 లక్షల మంది చిన్నారులపై ప్రభావం పడిందని యూనిసెఫ్‌ అధికార ప్రతినిధి జేమ్స్‌ ఎల్డర్‌ చెప్పారు.

సిరియాలో బాలల దురవస్థ
పన్నెండేళ్లుగా అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న సిరియాలో ఇప్పటికే చిన్నారులు దారుణమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. యుద్ధ వాతావరణంలో గత పదేళ్లలో సిరియాలో 50 లక్షల మంది జన్మిస్తే వారిలో మూడో వంతు మంది మానసిక సమస్యలతో నలిగిపోతున్నారు. బాంబు దాడుల్లో ఇప్పటికే 13 వేల మంది మరణించారు. పులి మీద పుట్రలా ఈ భూకంపం ఎంత విలయాన్ని సృష్టించిందంటే 25 లక్షల మంది పిల్లల జీవితాలను అల్లకల్లోలం చేసినట్టుగా యూనిసెఫ్‌ అంచనా వేస్తోంది. ఇంతమందికి సరైన దారి చూపడం సవాలుగా మారనుంది.

పిల్లల భవిష్యత్తుకి చేయాల్సింది ఇదే.!
ప్రపంచవ్యాప్తంగా చిన్నారుల విద్య, సంక్షేమం కోసం కృషి చేసే ఐక్యరాజ్యసమితి సంస్థ యునిసెఫ్‌ ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు జరిగే ప్రాంతాలు, కరువు, పేదరికం ఎదుర్కొనే దేశాల్లో పిల్లలకి భద్రమైన భవిష్యత్‌ కోసం కొన్ని మార్గదర్శకాలు నిర్దేశించింది...

► ప్రభుత్వాలు యూనివర్సల్‌ క్యాష్‌ బెనిఫిట్‌ స్కీమ్‌లతో పిల్లలకు ప్రతి నెలా ఆదాయం వచ్చేలా చూడాలి.
► శరణార్థులు సహా అవసరంలో ఉన్న పిల్లలందరికీ సామాజిక సాయం అందేలా చర్యలు చేపట్టాలి.
► ప్రకృతి వైపరీత్యాల ముప్పున్న ప్రాంతాలతో పాటు , ఇతర ఘర్షణాత్మక ప్రాంతాల్లో సంక్షేమ వ్యయాన్ని వీలైనంత వరకు పరిరక్షించాలి.
► పిల్లల చదువులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వారు బడి బాట పట్టేలా చర్యలు తీసుకోవాలి.
► మాత శిశు సంరక్షణ, పోషకాహారం అందించడం.
► బాధిత కుటుంబాలకు మూడు పూటలా కడుపు నిండేలా నిత్యావసరాలపై ధరల నియంత్రణ ప్రవేశపెట్టాలి.
చిన్నారులపై పడే ప్రభావాలు  
► ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి విపత్తులతో ప్రభావానికి లోనయ్యే పిల్లల సంఖ్య సగటున ఏడాదికి 17.5 కోట్లుగా ఉంటోందని యునెస్కో గణాంకాలు చెబుతున్నాయి.  
► ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలతో ఒంటరైన పిల్లలు ఎన్నో శారీరక, మానసిక సమస్యలు ఎదుర్కొంటారు. కుటుంబానికి దూరంగా ఉండడం వల్ల వారిలో పెరుగుదల ఆరోగ్యంగా ఉండదు. ఇలా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న వారు పుట్టకొకరు చెట్టుకొకరుగా మారిన పిల్లల్లో 18% వరకు ఉంటారు.  
► 50% మంది పిల్లలు మానసిక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. భూకంపం వంటి ముప్పులు సంభవించినప్పుడు గంటల తరబడి శిథిలాల మధ్య ఉండిపోవడం వల్ల ఏర్పడ్డ భయాందోళనలు వారిని చాలా కాలం వెంటాడుతాయి.
► సమాజంలో ఛీత్కారాలు దోపిడీ, దూషణలు, హింస ఎదుర్కొంటారు. బాలికలకు ట్రాఫికింగ్‌ ముప్పు!
► తుఫాన్లు, వరదలు, భూకంపాల వల్ల ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల పిల్లలు బాల కార్మికులుగా మారుతున్నారు.   
► 2021లో ప్రకృతి వైపరీత్యాలు, ఉక్రెయిన్‌ వంటి యుద్ధాల కారణంగా 3.7 కోట్ల మంది పిల్లలు చెట్టుకొకరు పుట్టకొకరుగా మారారు.  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

మరిన్ని వార్తలు