Turkey Earthquake: టర్కీ భూకంపం.. రెండుగా చీలిపోయిన గ్రామం.. 13 అడుగుల లోతుకు కుంగిన ఇళ్లు

19 Feb, 2023 14:01 IST|Sakshi

ఇస్తాన్‌బుల్‌: టర్కీలో ఫిబ్రవరి 6న సంభవించిన భారీ భూకంపం 11 రాష్ట్రాలను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. వేల ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఇప్పటివరకు 46వేల మందికిపైగా మరణించారు. అయితే ఈ భూకంపం కారణంగా హతాయ్ రాష్ట్రంలోని డెమిర్‌కోప్రు అనే గ్రామం రెండుగా చీలీపోయిది. భూప్రంకనల ధాటికి భారీ పగుళ్లు వచ్చి ఇక్కడి ఇళ్లు భూమిలోకి 13 అడుగుల మేర కుంగిపోయాయి. ఈ కారణంగా భూకంపం ముందు రోడ్డపక్కన కన్పించిన ఇళ్లు ఇప్పుడు మాయమయ్యాయి.

1000 మంది నివసించే ఈ గ్రామంలో ఇళ్లన్నీ కుంగిపోయాయి. ఎటు చూసినా శిథిలాలు, నేలకూలిన చెట్లు, మురికి నీరే కన్పిస్తోంది. తన ఇల్లు 4 మీటర్ల లోతులోకి కుంగిపోయిందని 42 ఏళ్ల మహిర్ కరటాస్ అనే వ్యక్తి వెల్లడించాడు. ఈ గ్రామంలో తొలినాళ్లలోనే ఈయన ఇల్లు కట్టుకున్నాడు. అదృష్టవశాత్తు గ్రామంలో ఎవరూ చనిపోలేదని, కానీ చాలామందికి గాయాలయ్యాయని వివరించాడు.

భూకంపం వచ్చినప్పుడు ఈ గ్రామంలోని ప్రజలు ఇళ్ల కిటికీల నుంచి బయటకు దూకేశారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయంతో పరుగులు తీసి సురక్షిత ప్రదేశాలకు చేరుకున్నారు.

భూప్రకంపనల వల్ల ఈ గ్రామంలోని ఓ పశువుల కొట్టం కూడా కుంగిపోయింది. దాని మధ్యలో చీలికలు వచ్చాయి. దీంతో ఓ ఆవు అందులోనే కూరుకుపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.


చదవండి: లీటర్ పాలు రూ.250, కేజీ చికెన్ రూ.780.. పాకిస్తాన్ దివాళా తీసిందని ఒప్పుకున్న మంత్రి..

మరిన్ని వార్తలు