చిన్న అక్షర దోషం.. రాజకీయ నాయకుడి భార్యకు జైలు శిక్ష

13 Nov, 2021 11:33 IST|Sakshi

టర్కీ న్యాయస్థానం తీర్పుపై పెల్లుబికుతున్న ఆగ్రహం

అంకారా: మన వల్ల ఎలాంటి తప్పు జరగకపోయినా సరే శిక్ష అనుభవించాల్సి వస్తే చాలా బాధగా ఉంటుంది. అలాంటిది వేరేవారి నిర్లక్ష్యం కారణంగా.. చిన్న అక్షర దోషం ఫలితంగా కోర్టు ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తే.. అది కూడా ఓ రాజకీయ నాయకుడి భార్యకు ఈ పరిస్థితి తలెత్తితే.. పీకల దాకా కోపం వస్తుంది. ప్రస్తుతం ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు టర్కీకి చెందిన ఓ రాజకీయ నాయకుడి భార్య. ఆమె తప్పు ఏం లేకపోయినా.. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఆమెకు ఏకంగా రెండున్నరేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. ఆ వివరాలు.. 
(చదవండి: సోఫాతో ఆమెను చంపేద్దామనుకున్నావా ఏంటి?)

టర్కీకి చెందిన టీచర్‌, రాజకీయ నాయకుడి భార్య బసక్ డెమిర్టాస్ అనే మహిళ 2015లో తీవ్రమైన అస్వస్థతకు గురయ్యింది. ఆ సమయంలో ఆమె గర్భవతిగా ఉంది. అనారోగ్యం ఫలితంగా డెమిర్టాస్‌కు గర్భస్రావం అయ్యింది. ఈ క్రమంలో ఆస్పత్రి సిబ్బంది ఆమెను ఐదు రోజులు రెస్ట్‌ తీసుకోవాల్సిందిగా సూచించారు. అయితే డెమిర్టాస్‌ ఆస్పత్రిలో చేరింది 2015, డిసెంబర్‌ 11న కాగా.. ఆస్పత్రి సిబ్బంది డిసెంబర్‌ 14 అని రిపోర్టులో తప్పుగా టైప్‌ చేశారు. ఇది గమనించని డెమిర్టాస్‌.. వైద్యులు సూచించిన మేరకు ఐదు రోజులు సెలవు తీసుకుంది.

ఇక పెయిడ్‌ లీవ్‌ అప్లై చేస్తూ.. డాక్టర్లు ఇచ్చిన రిపోర్టును అందులో సబ్మిట్‌ చేసింది. అయితే దానిలో డెమిర్టాస్‌ డిసెంబర్‌ 14న ఆస్పత్రిలో చేర్చినట్లు ఉంది. ఈ క్రమంలో ఆమె తప్పుడు రిపోర్టులు సబ్మిట్‌ చేసి.. మోసం చేసిందనే ఆరోపణలపై డెమిర్టాస్‌ మీద పోలీసులుకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కోర్టు 2018లో డెమిర్టాస్‌కు, ఆమెకు వైద్యం చేసిన డాక్టర్‌కి రెండున్నరేళ్ల జైలు శిక్ష విధించింది.
(చదవండి: కన్నీళ్లు ఇంకిపోయేలా ఏడ్చాను)

ఈ సందర్భంగా డెమిర్టాస్‌ న్యాయవాదులు మాట్లాడుతూ.. ‘‘ఆసుపత్రి రికార్డు పుస్తకంలో డెమిర్టాస్‌ డిసెంబర్‌ 11న ఆస్పత్రిలో చేరినట్లు ఉంది. అక్షర దోషం వల్లే ఈ  తప్పు జరిగిందని కోర్టుకు తెలిపాము. ఈ క్రమంలో కోర్టు ఆస్పత్రి రికార్డు బుక్‌ను సాక్ష్యంగా చూడకుండానే శిక్ష విధించింది. ఇది కేవలం రాజకీయ కుట్రే’’ అని పేర్కొన్నారు. ఈ తీర్పుపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

‘‘ఒక సైంటిఫిక్‌ ఫైల్‌కు సంబంధించి చిన్న క్లరికల్‌ తప్పిదం వల్ల కోర్టు డెమిర్టాస్‌, డాక్టర్‌కి కలిపి ఐదు సంవత్సరాల శిక్ష విధించింది. ఇది చిన్న తప్పిదం కాదు. భయంకరమైన రాజకీయ కుట్ర’’ అని టర్కీపార్లమెంట్ రిపోర్టర్ నాచో సాంచెజ్ అమోర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

చదవండి: మహిళను తోసేసిన ఎమ్మెల్యే.. గర్భస్రావం

మరిన్ని వార్తలు