Turkey-Syria earthquake: ఆశలు సమాధి?

12 Feb, 2023 02:15 IST|Sakshi
టర్కీలోని ఆంటాక్యా సిటీలో ఓ బాలుడిని ఐదు రోజుల తర్వాత భవన శిథిలాల నుంచి సజీవంగా బయటకు తీసుకొచ్చి అంబులెన్స్‌లోకి ఎక్కిస్తున్న దృశ్యం

తుర్కియే, సిరియాల్లో 26 వేలు దాటిన మృతుల సంఖ్యఆచూకీ లేని వారు బతకడం కష్టమే!

అంటాక్యా: తుర్కియే, సిరియాలో భూకంపం వచ్చి అయిదు రోజులు దాటిపోవడంతో కనిపించకుండా ఉన్న తమ సన్నిహితులు క్షేమంగా తిరిగి వస్తారన్న విశ్వాసం అందరిలోనూ సన్నిగిల్లుతోంది. ఇప్పటివరకు 26 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ శవాల గుట్టలు బయటకు వస్తూనే ఉన్నాయి. తుర్కియేలో హతే ప్రావిన్స్‌కు వెళ్లి ఫుట్‌బాల్‌ బృందంలో ఉన్న వారందరి మృతదేహాలు బయటకు వచ్చాయి.

ఇప్పటివరకు తుర్కియేలో మాత్రమే 80 వేల మంది గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉంటే, 10 లక్షల మంది ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ఆ శవాల మధ్య జీవచ్ఛవాలుగా మారిన కొందరు కొన ఊపిరితో ఉన్న ప్రాణాలతో బయటపడుతున్నారు. 80 ఏళ్ల ముదుసలి నుంచి పది రోజుల బాలుడు వరకు దాదాపుగా 120 గంటల సేపు శిథిలాల కింద కూరుకుపోయిన వారు ఇప్పటివరకు 12 మంది ప్రాణాలతో బయటపడ్డారు.  

ఉత్తరాఖండ్‌ వాసి మృతి  
భూకంపం వచ్చిన రోజు నుంచి కనిపించకుండా పోయిన భారతీయుడు, ఉత్తరాఖండ్‌కు చెందిన విజయ్‌కుమార్‌ గౌడ్‌ మరణించాడు. అతను బస చేసిన హోటల్‌ శిథిలాల నుంచి మృతదేహాన్ని వెలికి తీశారు. ఉత్తరాఖండ్‌లోని పౌరి జిల్లాకు చెందిన విజయ్‌కుమార్‌ గౌడ్‌ బెంగళూరు కంపెనీలో పని చేస్తున్నారు. ఆఫీసు పని మీద తుర్కియే వెళ్లారు. అప్పుడే కుదిపేసిన భూకంపం ఆయన నిండు ప్రాణాలను తీసేసింది. అతని చేతి మీద ఉన్న ఓం అన్న టాటూ సాయంతో గౌడ్‌ మృతదేహాన్ని గుర్తు పట్టినట్టుగా భారత రాయబార కార్యాలయం     వెల్లడించింది.  

ఒకే కుటుంబంలో ఐదుగురు క్షేమం  
గజియాంటెప్‌ ప్రావిన్స్‌ నర్డాగ్‌లో ఒక ఇల్లు కుప్పకూలిపోయి, ఆ ఇంట్లో శిథిలాల కింద చిక్కిన ఉన్న ఐదుగురు కుటుంబసభ్యులను సహాయ సిబ్బంది బయటకు తీసుకువచ్చారు. మొదట తండ్రి హసన్‌ అస్లాన్‌ను శిథిలాల కింద నుంచి బయటకు తీయాలని అనుకుంటే , ఆయన తన కొడుకు, కూతుళ్లని మొదట బయటకు తీయండని మొరపెట్టుకున్నాడు. మొత్తమ్మీద అందరినీ కాపాడిన సహాయ సిబ్బంది గాడ్‌ ఈజ్‌ గ్రేట్‌ అంటూ ఆనందం వ్యక్తం చేశారు.

పదిరోజుల పసికందు మృత్యుంజయుడు
గడ్డ కట్టించే చలి, భవనం శిథిలాల మధ్య, నీళ్లు, పాలు లేకుండా భూకంపం  పది రోజుల వయసున్న బాలుడు 90 గంటల సేపు పోరాటం చేశాడు. చివరికి గెలిచి మృత్యుంజయుడై తిరిగి వచ్చాడు. తుర్కియేలో భూకంప ప్రభావం అధికంగా ఉన్న హతే ప్రావిన్స్‌లో శిథిలాల కింద తల్లి, తన పదేళ్ల బాలుడు యాగిజ్‌ ఉలాస్‌తో నాలుగు రోజులు అలాగే ఉండిపోయింది. సహాయ సిబ్బంది సిమెంట్‌  శ్లాబుల తొలగిస్తూ ఉండగా ఆ పసికందు మూలుగు వినిపించింది. జాగ్రత్తగా శిథిలాల నుంచి తొలగించి ప్రాణాలతో ఉన్న ఆ బాలుడిని థర్మల్‌ బ్లాంకెట్‌లో చుట్టి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఈ మిరాకిల్‌ బాయ్‌ చురుగ్గా ఉన్నప్పటికీ తల్లి బాగా నీరసించిపోయే దశలో ఉంది.

మరిన్ని వార్తలు