కారు డ్రైవర్‌కు రూ.40 కోట్ల జాక్‌పాట్‌; కానీ ట్విస్ట్‌ ఏంటంటే

4 Jul, 2021 17:03 IST|Sakshi

అబుదాబి: 37 ఏళ్ల రెంజిత్‌ సోమరాజన్‌ 2008లో కేరళ నుంచి అబుదాబికి వెళ్లి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 12 ఏళ్లలో ఎప్పుడు కలిసిరాని అదృష్టం ఒక్కరాత్రిలోనే వరించింది. లక్కీడ్రాలో ఏకంగా 20 మిలియన్‌ దిర్హామ్‌( భారత కరెన్సీలో దాదాపు రూ. 40 కోట్లు) దక్కించుకున్నాడు. అయితే ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే ఆ 40 కోట్ల రూపాయలను రెంజిత్‌తో పాటు మరో తొమ్మిదిమంది పంచుకోవాల్సి ఉంది. ఎందుకంటే రెంజిత్‌తో పాటు వివిధ దేశాలకు చెందిన మరో తొమ్మిది మంది కూడా లక్కీడ్రాలో డబ్బును గెలుచుకున్నారు. ఈ విషయాన్ని ఖలీజ్‌టైమ్స్‌ పత్రిక శనివారం వెల్లడించింది.ఇక తన వాటా కింద సోమరాజన్‌కు ఎంతలేదన్న దాదాపు 4 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉంది. ఈ లెక్కన చూసుకుంటే మూడేళ్లుగా లాటరీ టికెట్లు కొంటున్న సోమరాజన్‌కు పంట పండినట్లే.

ఇదే విషయమై రెంజిత్‌ సోమరాజన్‌ స్పందిస్తూ.. '' నాకు ఇంత జాక్‌పాట్‌ తగులుతుందని ఊహించలేదు. 2008లో ఇండియా నుంచి దుబాయ్‌కు వచ్చాను. అప్పటినుంచి బతుకుదెరువు కోసం డ్రైవర్‌గా మారాను. గతేడాది ఒక కంపెనీ డ్రైవర్‌ కమ్‌ సేల్స్‌మన్‌గా పనిచేశాను. ఆ సమయంలో నేను సరైన సేల్స్‌ చేయని కారణంగా నా జీతంలో కోత విధించేవారు. అది నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. అప్పటినుంచి లాటరీ టికెట్లు కొనుగోలు చేయడం ప్రారంభించాను. అలా పాకిస్తాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌కు చెందని మిగతా వ్యక్తులతో కలిసి ''రెండు కొంటే ఒక లాటరీ టికెట్‌ ఉచితం'' ఆఫర్‌ను కనుక్కున్నా. ఆ తొమ్మిది మంది నుంచి 100 దిర్హామ్‌లు వసూలు చేసి జూన్‌ 29న టికెట్‌ను కొనుగోలు చేశాను. నా ఒక్కడి పేరుతో తీస్తే అదృష్టం లేదని.. అందుకే మరో తొమ్మిది మందిని జత చేశాను. ఇవాళ నా పంట పండింది. నా వాటా తీసుకొని మిగతాది మావాళ్లకు ఇచ్చేస్తాను. ఎందుకంటే వారు నాపై నమ్మకం ఉంచి లాటరీ టికెట్‌కు డబ్బులు అందించారు''. అని చెప్పుకొచ్చాడు.
 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు