అధ్యక్ష రేసులో ఆయన.. అతలాకుతలం.. ట్విటర్‌కు డేంజర్‌ బెల్‌!

25 May, 2023 13:14 IST|Sakshi

శాన్‌ ఫ్రాన్సిస్కో: ఆయన అగ్రరాజ్యం అధ్యక్ష రేసుపై ఆసక్తి ప్రకటించాడు. ఆ క్షణం నుంచే ప్రచారం ప్రారంభిస్తున్నానని తెలిపాడు. అయితే అందుకు ఆయన ఎంచుకున్న వేదిక..  అవతలి నుంచి సంభాషణ జరిపిన వ్యక్తి.. తదితర కారణాలతో సోషల్‌ మీడియా అతలాకుతలం అయ్యింది. 

ఫ్లోరిడా గవర్నర్‌ రాన్‌ డెశాంటిస్‌ అమెరికా అధ్యక్ష రేసులో ప్రచారం ప్రారంభించారు. అమెరికా పునర్వైభవం కోసం తాను పోటీ చేయబోతున్నట్లు ట్వీట్‌ చేశారాయన. సారథ్యం వహించే ధైర్యం కావాలి, గెలిచే శక్తి ఉండాలి అంటూ తన ప్రచార నినాదాన్ని సైతం ప్రకటించారాయన. అయితే.. ఆ సమయంలో ట్విటర్‌ క్రాష్‌ అయిపోవడం గమనార్హం. అంతకు ముందు ఆయన రిపబ్లికన్‌ పార్టీ తరుపున అధ్యక్ష బిడ్‌ను ధృవీకరిస్తూ ఫెడరల్‌ ఎన్నికల అధికారులకు నామినీ పత్రాలను సమర్పించారు. దీంతో రిపబ్లికన్‌ పార్టీ నుంచి డొనాల్డ్‌ ట్రంప్‌కు పోటీగా.. రాన్‌ సైతం బిడ్‌లో నిలిచినట్లయ్యింది. 

ట్విటర్‌ సీఈవో ఎలన్‌ మస్క్‌తో కలిసి  లైవ్‌ ఆడియో ఛాట్‌లో పాల్గొన్నారు ఫ్లోరిడా గవర్నర్‌ రాన్‌ డెశాంటిస్‌. ఆరున్నర లక్షల మందికిపైగా ఆ సంభాషణను లైవ్‌లో విన్నారు. ఇంకేం.. ఆ సమయంలో ట్విటర్‌ పదే పదే క్రాష్‌ అయ్యింది. 

గతేడాది అక్టోబర్‌లో ఎలన్‌ మస్క్‌.. ట్విటర్‌ను టేకోవర్‌ చేశాడు. ఆ సమయంలోనే వేలమందిని తొలగించాడు. వాళ్లలో బగ్స్‌ను ఫిక్స్‌ చేసే ఇంజినీర్లు సైతం ఉండడం గమనార్హం. ఒకేసారి ట్విటర్‌పై లక్షల్లో యూజర్లు ఎగబడినప్పుడు.. ఆ హెవీ ట్రాఫిక్‌ కారణంగా ఇలాంటి అంతరాయం ఏర్పడుతుంది. ఈ ఏడాదిలో ట్విటర్‌ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం ఇది ఆరోసారి. 

అయితే.. ఈ ప్రభావం ట్విటర్‌ను ముందు ముందు దారుణంగా దెబ్బ తీయొచ్చని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. మరోవైపు అదే టైంలో.. #FailuretoLaunch #Crashed,  #DeSaster లాంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్విటర్‌ విషయంలో ట్రెండ్‌ అవుతుండడం గమనార్హం. 

మరిన్ని వార్తలు