Twitter down: సమ్‌థింగ్‌ వెంట్‌ రాంగ్‌..

1 Jul, 2021 15:36 IST|Sakshi

ట్విటర్‌ డౌన్ యూజర్ల ఫిర్యాదులు..!

80 శాతం  యూజర్లకు  ఇబ్బంది : డౌన్‌డిటెక్టర్‌

సాక్షి, న్యూఢిల్లీ: యూజర్ల ప్రైవసీ, ఫేక్‌ న్యూస్‌ వ్యవహారంలో దేశంలో ఇప్పటికే  ఇబ్బందులు పడుతున్న ట్విటర్‌ మరోసారి చిక్కుల్లో పడింది. భారత్‌ సహా పలు దేశాల్లో ట్విటర్‌ లాగిన్‌ సమస్య తలెత్తడం కలకలం రేపింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ట్విటర్‌ పనిచేయడం లేదంటూ యూజర్లు గగ్గోలు పెట్టారు. పదే పదే రిఫ్రెష్‌ కొట్టి మరీ లాగిన్‌కి ప్రయత్నించినపుడు సమ్‌థింగ్‌ వెంట్‌ రాంగ్‌..అన్న సందేశం యూజర్లను వెక్కిరించింది. సాంకేతిక సమస్యల కారణంగా ట్విటర్‌లోకి లాగిన్‌  కాలేకపోతున్నామంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేస్తున్నప్పుడు ట్విట్టర్ వినియోగదారులు సమస్యలను ఎదుర్కోవడం కలకలం రేపింది. అలాగే తమ ప్రొఫైల్ యాక్సెస్ అవడం లేదని, కొందరికి టైమ్ లైన్ ఫీచర్ రావడం లేదని ఆరోపించారు. అయితే ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ఫోన్‌లలో ఎలాంటి సమస్యలేక పోవడంతో కొంతమంది వినియోగదారులకు ఊపిరి పీల్చుకున్నారు.

డౌన్‌డిటెక్టర్‌  నివేదిక ప్రకారం 80 శాతం మంది వినియోగదారులు ముఖ్యంగా ఉదయం 8 గంటల సమయంలో వెబ్‌సైట్‌తో ఇబ్బంది పడ్డారు.16 శాతం ఆండ్రాయిడ్ యాప్ యూజర్లు ఈ యాప్‌ను యాక్సెస్ చేయలేకపోయారని, 8 శాతం ఐఓఎస్ యూజర్లు యాప్‌లో సమస్య తలెత్తిందని నివేదించింది. దాదాపు గంట సేపు ఈ గందరగోళం కొనసాగినట్టు పేర్కొంది. మరోవైపు ఈవ్యవహారంపై ట్విటర్‌ అధికారికంగా స్పందించింది. ఇబ్బందుల విషయం తమ దృష్టికి వచ్చిందని పరిష్కరిస్తున్నామని తెలిపింది.  యూజర్లు ఆందోళన చెందాల్సిన పనిలేదని, వీలైనంత త్వరగా  సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించింది. ఆతరువాత సమస్య పరిష్కారమైనట్టు వెల్లడించింది. అయితే కొంతమంది ఇప్పటికి ఈ సమస్య విముక్తి లభించలేదని  తెలుస్తోంది.

చదవండి : ట్విట్టర్‌కు జాతీయ మహిళా కమిషన్‌ ఆదేశం

మరిన్ని వార్తలు