‘ట్విట్టర్‌ కిల్లర్‌’.. పర్మిషన్‌ తీసుకుని చంపాడు

1 Oct, 2020 15:13 IST|Sakshi

టోక్యో: సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకుని, తొమ్మిది మందిని హత్యచేసి ట్విట్టర్ కిల్లర్‌గా ప్రసిద్ధి చెందిన జపాన్‌ దేశస్తుడు తకాహిరొ షిరాయిషిను బుధవారం న్యాయస్థానంలో ప్రవేశపెట్టినట్టు స్థానిక మీడియా తెలిపింది. విచారణ సమయంలో బాధితుల సమ్మతితోనే ఈ హత్యలు చేశాడని నిందితుడి తరఫు లాయర్ వాదించడం గమనార్హం. చనిపోయిన వారంతా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు అతడితో పంచుకోవడం వల్లే వారిని హత్య చేశాడని లాయర్‌ వాదించాడు. హత్యచేసిన తర్వాత బాధితుల శరీరాన్ని ముక్కలు చేసి, వాటిని కూల్ బాక్సుల్లో భద్రపరిచినట్టు తేలింది. అతడిపై హత్య కేసుతోపాటు అత్యాచారం కేసు నమోదయ్యింది. మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకోడానికి సిద్ధంగా ఉన్న15-26ఏళ్ల మధ్య వయస్కులను నరహంతకుడు షిరాయిషి ట్విట్టర్ ద్వారా సంప్రదించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆత్మహత్య చేసుకునే విషయంలో సాయం చేస్తానని, తాను కూడా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు వారిని నమ్మబలికి హత్యలు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసులో దోషిగా తేలితే షిరాయిషికి ఉరిశిక్ష విధిస్తారు.(చదవండి: ‘వావ్‌.. చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంది’)

నిందితుడి తరఫు లాయర్ మాత్రం.. బాధితుల సమ్మతితోనే వారి చావుకు సహకరించాడని, అతడికి ఆరు నెలల నుంచి ఏడేళ్ల వరకు శిక్ష విధించాలని కోరాడు. అయితే అధికారులు మాత్రం ఈ వాదనలు సరైనవి కాదని, ఎటువంటి అనుమతి తీసుకోకుండానే హత్యలు చేశాడని వెల్లడించారు. బాధితుల తల వెనుక భాగంలో గాయాలు ఉన్నాయి... అంటే దీని అర్థం సమ్మతి లేదని, వారు ప్రతిఘటించారని అన్నారు. మూడేళ్ల క్రితం తాను ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తున్నట్టు ట్వీట్ చేసిన ఓ 23 ఏళ్ల మహిళ కనిపించకుండా పోవడంతో షిరాయిషి హత్యలు బయటపడ్డాయి. సదరు మహిళ కనిపించకుండా పోయిన తర్వాత బాధితురాలి సోదరుడికి అనుమానం వచ్చి ఆమె ట్విట్టర్ ఖాతాను తెరవగా విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసి, దర్యాప్తు చేపట్టారు. షిరాయిషీతో ఆమె తరుచూ ట్విట్టర్‌లో సంప్రదించినట్టు గుర్తించి, అతడిని అదుపులోకి తీసుకున్నారు. (చదవండి: ట్విట్టర్‌కు గట్టి మనిషి)

విచారణలో నిందితుడి ఇంటి కింది భాగంలో ఓ రహస్య గదిని బయటపడగా.. అందులో 9 మృతదేహాలను గుర్తించారు. అందులో ముక్కలుగా చేసిన శరీర భాగాలు, 240 ఎముకలను బాక్సుల్లో దాచి ఉంచాడు. ప్రపంచంలోని పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ఏడు దేశాల్లో జపాన్‌లోనే అధికంగా ఏడాదికి 20వేల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు