అత్యంత ఆసక్తిదాయక స్థలమిదే

4 Nov, 2022 05:58 IST|Sakshi

న్యూయార్క్‌: అంతర్జాల ప్రపంచంలో అత్యంత ఆసక్తిదాయకమైన వేదిక అంటూ ఏదైనా ఉందంటే అది ట్విట్టర్‌ మాత్రమేనని ఆ సంస్థ నూతన అధిపతి, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ వ్యాఖ్యానించారు. ట్విట్టర్‌ ఖాతా అధీకృతమైనదని తేల్చి చెప్పే ‘బ్లూ’ టిక్‌ గుర్తు సదుపాయంతో కొనసాగే ప్రీమియం ఖాతాదారుల నుంచి నెలకు ఎనిమిది డాలర్ల రుసుము అమలుచేయాలన్న ఆలోచనల నడుమ తన ట్విట్టర్‌ సంస్థ ప్రాధాన్యతను మస్క్‌ గుర్తుచేశారు. ‘ ట్విట్టర్‌ అనేది ఇంటర్నెట్‌లో అత్యంత ఇంట్రెస్టింట్‌ ప్లేస్‌.

అందుకే నేను చేసిన ఈ ట్వీట్‌ను వెంటనే ఇప్పటికిప్పుడే చదివేస్తున్నారు’అని అన్నారు. ‘బ్లూ టిక్‌కు చార్జ్‌ చేస్తే అత్యంత క్రియాశీలకమైన వ్యక్తులు ఇకపై ట్విట్టర్‌ను వదిలేస్తారు. డబ్బులు రాబట్టేందుకు మీడియా, వ్యాపార సంస్థలే ఖాతాలు కొనసాగిస్తాయి. చివరకు ట్విట్టర్‌ ఒక బిల్‌బోర్డ్‌లాగా తయారవుతుంది’ అని బ్లూ టిక్‌ యూజర్‌ కస్తూరి శంకర్‌ ట్వీట్‌ చేశారు. ‘ తాము ఏ(సెలబ్రిటీ) ఖాతాను ఫాలో అవుతున్నామో సాధారణ యూజర్లకు తెలుసు. ప్రత్యేకంగా బ్లూ టిక్‌ అక్కర్లేదు’ అని మరొకరు ఎద్దేవాచేశారు.

మరిన్ని వార్తలు