ట్రంప్‌పై ప్రతీకారం తప్పదు; అది నకిలీ అకౌంట్‌!

23 Jan, 2021 17:34 IST|Sakshi

అది నకిలీ ఖాతా.. నిషేధించాం: ట్విటర్‌

టెహ్రాన్‌: ఇరాన్‌ సుప్రీంలీడర్‌  అయాతుల్లా అలీ ఖమేనీ కార్యాలయం చేసిన ట్వీట్‌ దుమారం రేపుతోంది. ఆయన ట్విటర్‌ ఖాతాను నిషేధించాలంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మద్దతుదారులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే అది ఖమేనీ అసలు ఖాతా కాదని ట్విటర్‌ యాజమాన్యం ప్రకటించింది. సదరు అకౌంట్‌పై నిషేధం విధించినట్లు తెలిపింది. ఇంతకీ విషయమేమిటంటే.. ట్రంప్‌ అగ్రరాజ్య పగ్గాలు చేపట్టిన తర్వాత అమెరికా- ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరిన విషయం తెలిసిందే. ఇక గతేడాది.. ఇరాన్‌ ఖుడ్స్‌ ఫోర్స్‌ అధిపతి ఖాసీం సులేమానిని అమెరికా దళాలు ఇరాక్‌లో హతమార్చిన నేపథ్యంలో వివాదం తారస్థాయికి చేరింది. ఈ క్రమంలో ఇరు దేశాలు పరస్పర క్షిపణి దాడులకు పాల్పడ్డాయి. 

దీంతో అమెరికాపై ఆగ్రహంతో ఊగిపోయిన ఇరాన్‌ ప్రభుత్వం... ట్రంప్‌ తలపై అప్పట్లో సుమారు రూ. 575 కోట్ల రివార్డును కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవి నుంచి దిగిపోయే చివరినాళ్లలో కూడా ట్రంప్‌ యంత్రాంగం, మధ్య ప్రాచ్య దేశంలో పెద్ద ఎత్తున బాంబర్లు, యుద్ధవాహక నౌకలు మోహరించింది. ఈ క్రమంలో ఇరాన్‌ యుద్ధాన్ని కోరుకోదని, అయితే తమ ప్రజలను కాపాడుకునేందుకు ఎంతటి సాహసానికైనా పూనుకుంటుందంటూ ఇటీవలే ఇరాన్‌ అమెరికాను హెచ్చరించింది. కొత్త సంవత్సరంలో అమెరికన్లకు శోకంలో ముంచవద్దంటూ అప్పటి అధ్యక్షుడు ట్రంప్‌నకు హెచ్చరికలు జారీచేసింది.(చదవండి: మళ్లీ వస్తా: డొనాల్డ్‌ ట్రంప్‌)

ఇక జనవరి 20న అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌ ప్రమాణస్వీకారం చేయడానికి ముందే ట్రంప్‌ శ్వేతసౌధాన్ని వీడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖమేనీ పేరిట శుక్రవారం ఓ ట్వీట్‌ ప్రత్యక్షమైంది. ‘‘తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాం. ఇరాన్‌ జనరల్‌ను బలితీసుకున్న అమెరికా దాడులకు బదులుగా.. అందుకు ఆదేశాలిచ్చిన వ్యక్తిపై ప్రతీకారం తప్పదు’’ అంటూ ట్రంప్‌ను పోలిన వ్యక్తి గోల్ఫ్‌ ఆడుతుండగా.. ఆయనపై నుంచి క్షిపణులు ప్రయాణిస్తున్నట్లుగా ఉన్న ఫొటోను షేర్‌ చేశారు. పర్షియన్‌ భాషలో ఉన్న ఈ ట్వీట్‌ ఖమేనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు స్థానిక మీడియాలోనూ దర్శనమిచ్చింది. ఈ విషయంపై తీవ్ర స్థాయిలో దుమారం రేగగా, దానిని తొలగించారు. ఇక ఇప్పుడు సదరు ఖాతా నకిలీదని, తమ కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆ అకౌంట్‌పై నిషేధం విధించినట్లు ట్విటర్‌ ప్రకటించింది.

మరిన్ని వార్తలు