కరోనా@ 2 కోట్లు

12 Aug, 2020 03:44 IST|Sakshi

సగానికి పైగా కేసులు అమెరికా, భారత్, బ్రెజిల్‌లోనే 

న్యూయార్క్‌/మాస్కో: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌–19 విజృంభణ ఆగడం లేదు. మంగళవారం నాటికి మొత్తం కేసుల సంఖ్య 2 కోట్లు దాటేసింది. అమెరికా, బ్రెజిల్, భారత్‌లలోనే మొత్తం కేసుల్లో సగానికిపైగా నమోదయ్యాయి. గత ఏడాది డిసెంబర్‌లో చైనాలోని వూహాన్‌లో తొలిసారిగా బట్టబయలైన కరోనా వైరస్‌ అమెరికా, బ్రెజిల్, భారత్, రష్యాలను ప్రస్తుతం వణికిస్తోంది. జాన్స్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం మంగళవారం ఉదయానికి ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల 11వేల 186 కేసులు నమోదయ్యాయి. కోవిడ్‌ మృతుల సంఖ్య 7 లక్షల 34వేలుగా ఉంది. కాగా 40శాతం కేసుల్లో ఎలాంటి లక్షణాలు లేవని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఏప్రిల్‌ మొదట్లో 10 లక్షల కేసుల వరకు నమోదైతే, మే 22 నాటికి కేసుల సంఖ్య 50 లక్షల కేసులు దాటేసింది. జూన్‌ చివరి నాటికి కేసుల సంఖ్య రెట్టింపై కోటి దాటింది. జూలై 22కి 1.5 కోట్ల కేసులు నమోదు కాగా ఆ తర్వాత మూడు వారాల్లో మరో 50 లక్షల కేసులు నమోదై మొత్తం కేసులు 2 కోట్లు దాటేశాయి. మరోవైపు 10 రోజుల తర్వాత న్యూజిలాండ్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. జపాన్, ఇండోనేషియాలలో కూడా కేసుల సంఖ్య బాగా పెరుగుతోంది. 

వ్యాక్సిన్‌తో పూర్తిగా వైరస్‌ పోదు: డబ్ల్యూహెచ్‌వో
కేసుల సంఖ్య అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్నప్పటికీ త్వరలోనే ఈ మహమ్మారి పీడ వదిలించుకోగలమని డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రాస్‌ అధ్నామ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్‌పై ఆశ పెట్టుకోకుండా వైరస్‌ని అణిచివేయడానికే ప్రయత్నించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికే రష్యా వ్యాక్సిన్‌ను విడుదల చేయగా మరో 165 కంపెనీలు వ్యాక్సిన్‌ తయారీలో నిమగ్నమై ఉన్నాయి. వాటిలో ఆరు మూడో దశ క్రినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్నాయి. వ్యాక్సిన్‌ వచ్చినప్పటికీ పూర్తిగా వైరస్‌ని నిర్మూలించలేమని టెడ్రాస్‌ అభిప్రాయపడ్డారు. పోలియో, మశూచి వంటి వ్యాధులకు వ్యాక్సిన్‌ వచ్చినా ఇంకా పూర్తిగా ఆ వ్యాధుల ముప్పు తొలగిపోలేదని గుర్తు చేశారు. 

రికవరీ@ 70%
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నప్పటికీ తగ్గుతున్న మృతుల రేటు,పెరుగుతున్న రికవరీ రేటు ఊరట కలిగిస్తోంది. మంగళవారం నాటికి భారత్‌లో కరోనా రికవరీ రేటు 69.8% ఉంటే, మరణాల రేటు 1.99%గా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో మొదటిసారిగా మరణాల రేటు 2శాతం కంటే తక్కువకి వచ్చిందని తెలిపింది. మృతుల్లో 70శాతానికిపైగా లెక్కకు మించి వ్యాధులతో బాధపడుతున్న వారని పేర్కొంది. 24 గంటల్లో 53,601 కరోనా కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 22,68,675కి చేరుకుంది. ఇక ఒక్క రోజులో 871 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 45,257కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 6,39,929 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఇవి 28.21 శాతం.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు