యూఎస్‌ ఎన్నికల్లో హిందూ ఓట్లు కీలకం!

5 Sep, 2020 08:43 IST|Sakshi

పలు రాష్ట్రాల్లో ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం 

వాషింగ్టన్‌: అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న సుమారు 20 లక్షల హిందువుల ఓట్లు ఎన్నికల్లో కీలకమని ఇండో అమెరికన్‌ రాజకీయనేత రాజా కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు. అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసే స్వింగ్‌ స్టేట్స్‌లో హిందువుల ఓట్‌బ్యాంక్‌ చాలా ముఖ్యమైనదన్నారు. డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన కృష్ణమూర్తి ఆన్‌లైన్‌లో హిందూ అమెరికన్స్‌ ఫర్‌ బైడెన్‌ పేరిట ప్రచారం ఆరంభించారు. జోబైడెన్, కమలాహారిస్‌ ద్వయానికి ఓటేయాలని ఈ సందర్భంగా ఆయన ఇండో అమెరికన్లను కోరారు. వసుధైక కుటుంబకమ్‌ అనే భావనను దృష్టిలో ఉంచుకొని బైడెన్‌కు మద్దతు పలకాలని కోరారు.

ఇండో అమెరికన్ల ప్రయోజనాల కోసం అందరూ ఓటింగ్‌లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఫ్లోరిడా, వర్జీనియా, పెన్సిల్వేనియా, మిషిగన్, విస్కాన్సిన్‌.. ఇలా అనేక రాష్ట్రాల్లో హిందూ ఓట్‌బ్యాంక్‌ చాలా కీలకమని, ప్రతిఒక్కరూ ఓట్‌ వేయడం ద్వారా స్వీయధర్మాన్ని పాటించాలని ఆయన చెప్పారు. మూడున్నరేళ్లుగా దేశంలో విద్వేష ప్రసంగాలు, వివక్ష పెరిగిపోయాయని ప్రచారంలో పాల్గొన్న న్యూజెర్సీ కో స్టేట్‌ డైరెక్టర్‌ నికి షా అభిప్రాయపడ్డారు. ట్రంప్‌ పాలనలో హిందువులపై విద్వేషం మూడు రెట్లు పెరిగిందని విమర్శించారు. కెంటకీలో స్వామినారాయణ్‌ గుడి వద్ద జరిగిన విధ్వంసాన్ని టెంపుల్‌ ప్రతినిధి రాజేశ్‌ పటేల్‌ వివరించారు. బైడెన్‌ మాట నిలబెట్టుకునే మనిషని, సమానత్వాన్ని విశ్వసిస్తాడని కృష్ణమూర్తి చెప్పారు. అందువల్ల ఆయనకు మద్దతు పలకాలని కోరారు.  

ప్రధానపార్టీల పోటాపోటీ 
హిందూ అమెరికన్ల మద్దతు కోరుతూ రెండు ప్రధాన పార్టీలు విపరీతంగా కృషి చేయడం ఇదే తొలిసారని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అటు ట్రంప్‌ ‘‘హిందూ వాయిసెస్‌ ఫర్‌ ట్రంప్‌’’ పేరిట, ఇటు బైడెన్‌ ‘‘హిందూ అమెరికన్స్‌ ఫర్‌ బైడెన్‌’’ పేరిట హిందూ ఓట్‌బ్యాంకును ఆకట్టుకునే యత్నాలు ముమ్మరం చేశారు. ఎవరికి వారు తామే హిందువుల హక్కుల పరిరక్షకులమని, వారి ఉన్నతికి తోడ్పడతామని చెప్పుకుంటున్నారు. 2016లో హిందూ ఓట్‌బ్యాంక్‌ బలాన్ని గమనించిన ట్రంప్‌ వీరిని ఆకట్టుకునేందుకు పలు యత్నాలు చేశారు. ఆయన, ఆయన కుటుంబసభ్యులు పలు దేవాలయాలను సందర్శించారు. ఈ దఫా మరోమారు వీరి మద్దతు కోసం ట్రంప్‌ యత్నిస్తుండగా, వీరిని తనవైపునకు మలచుకునేందుకు బైడెన్‌ ప్రయత్నిస్తున్నారు.  

చదవండి: పోస్టల్‌ ఓట్లకు భారీ డిమాండ్‌

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు