రెండు రాజ్యాల ఏర్పాటే ఏకైక పరిష్కారం: జో బైడెన్‌

23 May, 2021 01:17 IST|Sakshi

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పష్టీకరణ 

వాషింగ్టన్‌: మిత్రదేశం ఇజ్రాయెల్‌ భద్రత విషయంలో తమ అంకితభావంలో ఎలాంటి మార్పు లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఉద్ఘాటించారు. ఇజ్రాయెల్‌–పాలస్తీనా వివాదానికి రెండు రాజ్యాల ఏర్పాటే  ఏకైక పరిష్కార మార్గమని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్‌– హమాస్‌ సంస్థల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన మరుసటి రోజు జో బైడెన్‌ ఈ వ్యవహారంపై స్పందించారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఇజ్రాయెల్‌ రక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వివాదాస్పద వెస్టు బ్యాంక్‌కు కూడా రక్షణ కల్పిస్తామని పేర్కొన్నారు. వెస్టుబ్యాంక్‌ ప్రజల రక్షణే కాదు, ప్రజల ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.

ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహుతో జో బైడెన్‌ ఫోన్‌లో మాట్లాడారు. వివాదాలకు ముగింపు పలకాలని సూచించారు. రాకెట్ల దాడులు, వైమానిక దాడుల్లో కూలిపోయిన ఇళ్లను పునర్నిర్మించాలని చెప్పారు. ఆయుధ వ్యవస్థను పునర్నిర్మించుకొనే అవకాశాన్ని  హమాస్‌కు ఇవ్వొద్దన్నారు. ఇప్పుడు గాజా ప్రజలకు చేయూత అవసరమని తెలిపారు. వారిని ఆదుకొనేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. కాల్పుల విరమణ ఇలాగే కొనసాగాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఇజ్రాయెల్‌ ఒక యూదు దేశంగా మనుగడలో ఉంటుందని, దాన్ని తాము ఎప్పటికీ గుర్తిస్తామని తేల్చిచెప్పారు. 

మరిన్ని వార్తలు