జపాన్‌ను వణికిస్తున్న 'తలస్‌' తుఫాన్‌.. ఇద్దరు మృతి.. అంధకారంలోకి వేల మంది

25 Sep, 2022 17:00 IST|Sakshi

టోక్యో: సెంట్రల్‌ జపాన్‌లో తలస్ తుఫాను బీభత్సం సృష్టించింది. శుక్రవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాల ధాటికి వరదలు సంభవించాయి. కొంచరియలు విరిగిపడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో వేల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కకెగావా నగరంలో ఒకరు తన ఇంటిపై కొండచరియలు విరిగిపడి చనిపోయాడు. దీని పక్క నగరం ఫుకురోయ్‌లో మరోవ్యక్తి వరదలో వాహనంలో చిక్కుకుని మరణించాడు.  షిజువోకాలో మరో వ్యక్తి వరదలో వాహనం నడుపుతూ కొట్టుకుపోయి అదృశ్యమయ్యాడు. అతను కూడా ప్రాణాలు కోల్పోయి ఉంటాడని అనుమానిస్తున్నారు. 

శుక్రవారం, శనివారం రెండు రోజుల పాటు రికార్డుస్థాయిలో 40సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు జపాన్ వాతావరణ శాఖ వెల్లడించింది. వరదల వల్ల అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 1,20,000 ఇళ్లు అంధకారంలో ఉన్నాయి.  55వేల మంది ఇళ్లకు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వీరికి శుభ్రమైన నీటిని అందించేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

జపాన్‌లో వేసవి కాలం, శరద్ రుతువులతో తరచూ తఫాన్‌లు వస్తుంటాయి. గతవారం కూడా నన్మదోల్ తుఫాన్ నైరుతి జపాన్‌ను అతలాకుతలం చేసింది. అప్పుడు సంభవించిన వివిధ ప్రమాదాల్లో నలుగురు చనిపోయారు. మరో 147మంది గాయపడ్డారు.
చదవండి: బ్రిటన్‌ రాణి సమాధి ఫోటోలు వైరల్‌

మరిన్ని వార్తలు