పైలట్‌ కలల్ని పక్కన పెట్టి  వ్యవసాయం, సంపాదన ఎంతంటే? 

27 Jul, 2021 20:47 IST|Sakshi

చదివిన చదువుకు, చేస్తున్న ఉద్యోగానికి సంబంధం లేకుండా జీవనాన్ని సాగిస్తున్నవారిని మనచుట్టూ చాలామందినే చూసి ఉంటాం.   కానీ జీవితంలో ఏదైనా సాధించాలంటే రిస్క్‌ తీసుకోక తప్పదన్నదట్టు.. అనుకోకుండా తీసుకున్న నిర్ణయం కొందరి జీవితాల్ని పూర్తిగా మార్చేస్తుంది.  అలాంటి కథే  ఆఫ్రికాలోని ఉగాండాకు  చెందిన  మహిళా పైలట్‌ గ్రేస్ ఓమురాన్‌ది.

పైలట్‌గా ఆకాశంలో విమానంలో గంటల తరబడి చక్కర్లు కొట్టాలనేది గ్రేస్‌ ఓమురాన్ డ్రీమ్‌. ఉగాండాకు చెందిన గ్రేస్‌ తొలిసారి 2015-2016లో విమాన కార్యకలాపాలను అధ్యయనం చేసినప్పుడు ఎలాగైనా పైలట్‌ కావాలని పట్టుబట్టి చదివింది. చివరికి 2017లో  ఈస్ట్ ఆఫ్రికన్ సివిల్ ఏవియేషన్ అకాడమీలో శిక్షణ పొంది, 2019 నాటికి  క్యాడెట్ పైలట్‌గా అవతరించింది. చదువు పూర్తియ్యేనాటికి గర్భవతి అని తెలిసింది.  దాంతో ప్రసవం కోసం ఇంటికి చేరింది.  అక్కడే ఆమె జీవితం పూర్తిగా మలుపు తిరిగింది. ఖాళీగా పడి ఉన్న తన తండ్రి భూమిని చూసి ఏదైనా చేయాలని భావించింది. క్షణం ఆలస్యం చేయకుండా మామాడి, నారింజ, జీడి చెట్లను పెంచాలని నిర్ణయించింది.  అయితే దీనికి ముందుగా నర్సరీ ద్వారా  ప్రారంభించింది.  తద్వారా గ్రేస్ సిట్రస్  అండ్‌   మ్యాంగో  ఆర్చర్డ్  వ్యాపారానికి  శ్రీకారం  చుట్టింది. 

 మొదట రెండు ఎకరాల (సుమారు 0.81 హెక్టార్ల) అంటు వేసిన మామిడి చెట్లను నాటగా, మామిడి విరగకాశాయి. అంతే ఇక వెను దిరిగి చూడలేదు. మిగిలిన ఏడు ఎకరాల భూమిలో జీడి, అవకాడోను నాటించింది. అలా ప్రస్తుతం మొత్తం 12 ఎకరాల భూమిలో చక్కటి పండ్ల తోటను ఏర్పాటు చేసింది. దీంతో  కొత్త ఆదాయ వనరు దొరకడంతో  తన కాక్‌పిట్‌ కలలను పూర్తిగా మర్చిపోయి ఇపుడు సంతోషాన్ని అనుభవిస్తున్నానని ఒమురాన్‌ తెలిపింది. వాస్తవానికి ఫ్లయింగ్‌ ప్రతిష్టాత్మకమైనదే వ్యవసాయంలోనే సాయం ఉందని తాను విశ్వసిస్తున్నట్టు చెప్పింది.  

విమానయాన పరిశ్రమ ద్వారా చాలా వివిధ ఆఫర్లు వచ్చినప్పటికీ, ఒమురాన్ వ్యవసాయం నుండి బయటపడేది లేదని ఆమె స్పష్టం చేసింది. తనకున్న విజ్ఞానంతో తన ఉత్పత్తులకు మార్కెటింగ్‌ టెక్నాలజీని ఒంటపట్టించుకున్నారు.కెన్యాలోని వివిధ పరిశ్రమలు ముఖ్యంగా టెసో ఫ్రూట్ ఫ్యాక్టరీ, డిలైట్ ఫ్యాక్టరీతో సంబంధాల ద్వారా మార్కెటింగ్‌కు ఇబ్బంది లేకుండా చేసుకున్నారు.  మొదలు పెట్టిన రెండు సంవత్సరాల్లో ఆరు పంటకోత సీజన్ల ద్వారా సగటున ప్రతి పంటకు 5,000 యూఎస్ డాలర్లు (సుమారు 3 లక్షల, 72 వేల రూపాయలు, అంటే 6 సీజన్లకు 22 లక్షలు ఆదాయం) చేతికి వస్తున్నాయని ఆమె చెప్పారు. ప్రధానంగా నర్సరీ మొక్కల ద్వారా ఎక్కువ సంపాదిస్తున్నానని చెప్పారు. 

అలాగే తన విజయానికి యూత్‌ ప్రధాన కారణమని ఓమురాన్‌ గర్వంగా ప్రకటించింది. 30 మంది నైపుణ్యం కలిగిన యువకులకు ఉపాధి కల్పిస్తున్నట్టు చెప్పారు.  యువతతో పనిచేయడం ఇష్టపడతాననీ, జిల్లాలో యువజన గ్రూపులను ఏర్పాటు చేసి కొత్త నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. వాటిని తిరిగి ఆచరణలో పెడతారని ఆమె చెప్పు కొచ్చింది. అయితే కరోనా మహమ్మారి సంక్షోభం తమను  కూడా  తాకిందని, కానీ సవాళ్లను స్వీకరించి ముందుకు సాగినట్టు వెల్లడించింది. ఇతర వ్యాపారాల మాదిరిగానే,  వ్యవసాయంలో కూడా కష్టాలుంటాయని, కానీ శక్తివంతంగా పోరాడాలని సూచించింది. అలాగే చైనాలో వ్యవసాయ నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానాలపై పరిశోధన చేస్తున్నానని, అది  తన వ్యవసాయ క్షేత్రం అభివృద్దికి దోహదపడుతుందని భావిస్తున్నాననిపేర్కొంది. రాబోయేకాలంలో తన కృషిని మరింత విస్తరిస్తానని చెప్పింది. అంతేకాదు దేన్నైనా చిన్నగా ప్రారంభించ డానికి సంకోచించకూడదని, తొలి అడుగు ఎపుడూ చిన్నగానే ఉంటుందంటూ యువతకు పిలుపునివ్వడం విశేషం.  

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు