సిబ్బందిలో ఒకరికి కరోనా.. అయినా ‍ప్రధానికి క్వారెంటైన్‌ అవసరం లేదట!

8 Aug, 2021 11:57 IST|Sakshi

లండ‌న్: చట్టం ముందు అందరూ సమానులే, నిబంధనలు అందరికీ ఒకేలా వర్తిస్తాయంటారు. కానీ ఇవి మాటలకే గానీ ఆచరణలకు కాదనేలా నిరూపిస్తోంది ఈ ఘటన. తాజాగా బ్రిట‌న్‌లో ప్రజలకు ఒకలా, ప్రధానికి మరోలా నిబంధనలను అమలుచేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. బ్రిట‌న్ ప్ర‌ధాన‌మంత్రి బోరిస్ జాన్స‌న్ సిబ్బందిలో ఒక‌రికి క‌రోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. 

గ‌త వారాల్లో ప్ర‌ధాని చేసిన పర్యటనల్లో, ఆయన వెంట వెళ్లిన సిబ్బందిలో ఈ వ్యక్తి కూడా ఉన్నాడు. ఇందులో ఆశ్చర్యకర విషయం ఏమిటంటే జాన్స‌న్‌కు క్వారెంటైన్‌లో ఉండాల్సిన అవ‌స‌రం లేద‌ని బ్రిట‌న్ ప్ర‌ధాని అధికారిక కార్యాల‌యం డౌన్ స్ట్రీట్ స్ప‌ష్టం చేసింది. జాన్సన్ బుధవారం ఫైఫ్‌లోని పోలీసు కళాశాలను, అలానే గురువారం అబెర్డీన్‌షైర్‌లోని విండ్‌ఫార్మ్‌ని సందర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌నతో క‌లిసి తిరిగిన సిబ్బందిలో ఒక‌రికి కరోనా సోకింది. ఆతనికి స్కాట్లాండ్‌ ప్రయాణంలో నిబంధనల ప్రకారం జరిపిన  క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల్లో పాజిటివ్‌ గా తేలింది.

ఈ ఫలితాల అనంతరం ప్ర‌ధానికి ఐసోలేష‌న్ అక్క‌ర్లేద‌ని డౌన్ స్ట్రీట్ పేర్కొంటూ, అందుకు వివరణగా.. ఇటీవల జాన్స్‌న్‌ యూకే అంతటా క్రమం తప్పకుండా సందర్శిస్తున్నారని, అదే క్రమంలో కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా ఈ  ప్రయాణాలు జరుగుతున్నాయని తెలిపింది. "పరీక్షలో పాజిటివ్‌గా నిర్థారణ అయిన ఎవరితోనూ ప్రధాని కాంటెక్ట్‌ కాలేదు, కనుక ఆయన క్వారెంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని డౌన్ స్ట్రీట్ వెల్లడించింది. అయితే దీనిపై ప్ర‌తిప‌క్ష లేబ‌ర్ పార్టీ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. అధికార పార్టీ నేత‌లు ప్ర‌జ‌ల‌ను ఫూల్స్‌ను చేస్తున్నార‌ని ధ్వజమెత్తారు. అధికార పార్టీ నేత‌లు త‌మ‌కు ఓ రూల్‌, దేశ ప్ర‌జ‌లందరీకి ఒక రూల్‌ను అమ‌లు చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు.

మరిన్ని వార్తలు