డ్రోన్ల కోసం ఆకాశంలో ‘హైవే’! 

21 Jul, 2022 02:55 IST|Sakshi

రైళ్లు ప్రత్యేకంగా తమకంటూ ఉన్న పట్టాలపై పరుగెడుతుంటాయి.. కార్లు, బస్సుల్లాంటి వాహనాలు వేగంగా దూసుకెళ్లేందుకు ఎక్స్‌ప్రెస్‌ వేలు కడుతుంటారు. ప్రమాదాలు జరగకుండా రెడ్‌ సిగ్నళ్లు పెడు­తుంటారు. మరి ఆకాశంలో ఎగురుతూ వెళ్లే డ్రోన్ల పరిస్థితి ఏమిటి? అవి ఢీకొట్టుకోకుం­డా వెళ్లేదెలా? రోజురోజుకూ డ్రోన్ల వినియోగం పెరిగిపోతున్న నేపథ్యంలో ఇలాంటి సందేహాలె వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా యూకేలో డ్రోన్ల కోసం ప్రత్యేకంగా ‘సూపర్‌ హైవే’ను ఏర్పాటు చేస్తున్నారు. డ్రోన్లు ఒకదానికొకటి ఢీకొట్టుకోకుండా అత్యాధునిక టెక్నాలజీని ఇందులో వినియోగించనున్నారు. ఆ ప్రాజెక్ట్‌ స్కైవే విశేషాలు ఏమిటో తెలుసుకుందామా..                                
– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌ 

కొన్నేళ్లుగా డ్రోన్ల వినియోగం పెరిగిపోతోంది. కిరాణా సరుకుల నుంచి మందుల దాకా నేరుగా డ్రోన్లతో ఇళ్ల వద్దకు డెలివరీ ఇచ్చేలా ఇప్పటికే అమెజాన్‌ వంటి సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. మరి ఎవరికివారు ఇష్టారాజ్యంగా డ్రోన్లను ఎగురవేస్తే పెద్ద సమస్య అయి కూర్చుంటుంది. డ్రోన్లు ఒకదానికొకటి ఢీకొట్టుకోవడమే కాదు.. విమానాలు, హెలికాప్టర్లు వంటి వాటికీ ప్రమాదకరంగా మారుతాయి.

విద్యుత్, సెల్‌ఫోన్‌ టవర్లు, అతి ఎత్తయిన భవనాలను ఢీకొట్టడం వంటి సమస్యలూ ఉంటాయి. ఈ నేపథ్యంలో నేలపై రోడ్లు ఉన్నట్టుగానే.. డ్రోన్ల కోసం నిర్ణీత మార్గం ఏర్పాటు చేసేందుకు యూకేకు చెందిన ఆల్టిట్యూడ్‌ ఏంజిల్, బీటీ తదితర సంస్థలు ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. ఆ మార్గంలో డ్రోన్లు ఒకదానికొకటి ఢీకొట్టుకోకుండా ‘డీఏఏ (డిటెక్ట్‌ అండ్‌ అవాయిడ్‌)’ టెక్నాలజీని వినియోగించనున్నాయి.  

265 కిలోమీటర్ల పొడవున.. 
యూకే ఆగ్నేయ ప్రాంతంలో 265 కిలోమీటర్ల పొడవున ‘డ్రోన్‌ సూపర్‌ హైవే’ను ఏర్పాటు చేసేందుకు యూకే ప్రభుత్వం ఇటీవల అనుమతులు మంజూ రు చేసింది. కీలక నగరాలైన రీడింగ్, ఆక్స్‌ఫర్డ్, మిల్టన్‌ కీన్స్, కేంబ్రిడ్జ్, కొవెంట్రీ, రగ్బీ నగరాల మీదుగా ఈ డ్రోన్‌ హైవే సాగనుంది. 2024 జూన్‌ నా­టి­కి ఈ ‘డ్రోన్‌ సూపర్‌ హైవే’ ఏర్పాటును పూర్తి చేయా­లని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే దీనికి ఎంత ఖర్చవుతుందనే అంచనాలను వెల్లడించలేదు.  

ఏమిటీ డీఏఏ టెక్నాలజీ? 
గాల్లో ఎగురుతూ వెళ్లే డ్రోన్లు, ఇతర యూఏవీ (అన్‌మ్యాన్‌డ్‌ ఏరియల్‌ వెహికల్స్‌)లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. అవి ఒకదానికొకటి ఢీకొట్టుకోకుండా చేసేందుకు ఆల్టిట్యూడ్‌ ఏంజిల్‌ సంస్థ ‘డీఏఏ’ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. దీనిలో భాగంగా డ్రోన్లు ప్రయాణించే ప్రాంతాల్లో నిర్ణీత దూరంలో పెద్ద టవర్లను నిర్మించి, పలు రకాల పరికరాలను అమర్చుతారు. వీటికి యారో టవర్స్‌ అని పేరుపెట్టారు.

ఈ వ్యవస్థ ఎంతెంత పరిమాణంలో ఉన్న డ్రోన్లు.. ఎటువైపు నుంచి, ఎంత వేగంతో ప్రయాణిస్తున్నాయనేది గుర్తించి.. మిగతా డ్రోన్లకు సమాచారం ఇస్తుంది. ఢీకొట్టుకునే అవకాశమున్న డ్రోన్లకు వాటి మార్గం మార్చుకోవడం, మరికాస్త ఎత్తుకు ఎగరడం లేదా కిందికి దిగడం, వేగం తగ్గించుకోవడం, పెంచుకోవడం వంటి సూచనలు చేస్తుంది.  

డ్రోన్లలో మార్పులు అవసరం లేదు 
డ్రోన్‌ హైవేల్లో ప్రయాణించేందుకు, యారో టవర్లకు అనుసంధానం కావడం కోసం.. డ్రోన్లలో అదనపు పరికరాలేమీ అమర్చాల్సిన అవసరం లేదని ఆల్టిట్యూడ్‌ ఏంజిల్‌ సీఈవో రిచర్డ్‌ పార్కర్‌ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ టెక్నాలజీ అద్భుతాలు సృష్టిస్తుందని.. డ్రోన్‌ హైవేలు రవాణాలో కీలకపాత్ర పోషిస్తాయని భావిస్తున్నామని తెలిపారు.   

మరిన్ని వార్తలు