‘బ్రిటన్‌ ప్రధానిగా బోరిస్‌ సరైన వ్యక్తి’.. భారత సంతతి ఎంపీ మద్దతు

22 Oct, 2022 17:50 IST|Sakshi

లండన్‌: కొత్త ప్రధానమంత్రిని ఎన్నుకునేందుకు బ్రిటన్‌లో అధికార కన్జర్వేటివ్‌ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ప్రధాని రేసులో ఆర్థిక శాఖ మాజీ మంత్రి రిషీ సునాక్‌ పేరు బలంగా వినిపిస్తోంది. ఆయనకు 100 మందికిపైగా ఎంపీలు మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. మాజీ ‍ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ పోటీకి సిద్ధమయ్యారు. విహారయాత్రను అర్ధాంతరంగా ముగించుకుని బ్రిటన్‌ చేరుకున్నారు. ఈ క్రమంలో భారత సంతతి వ్యక్తి, బోరిస్‌ కేబినెట్‌లో హోంశాఖ మంత్రిగా పని చేసిన ప్రీతి పటేల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. లిజ్‌ ట్రస్‌ స్థానంలో ప్రధాని పదవి చేపట్టేందుకు బోరిస్‌ జాన్సన్‌ సరైన వ్యక్తి అని పేర్కొన్నారు. ఓవైపు.. రిషీ సునాక్‌కు ఎంపీల మద్దతు పెరుగుతున్న క్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది.

బోరిస్‌ జాన్సన్‌కు మద్దతు తెలుపుతూ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు ప్రీతి పటేల్‌.‘ ప్రస్తుత సమయంలో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోగల సత్తా మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు ఉందనటంలో ఆయనకు సరైన ట్రాక్‌ రికార్డ్‌ ఉంది. మన మేనిఫెస్టోను అమలు చేయగలరు. ఈ నాయకత్వ పోటీలో నేను ఆయనకు మద్దతు ఇస్తున్నాను.’అనిపేర్కొన్నారు ప్రీతి పటేల్‌. ప్రధాని రేసులో నిలవాలని భావిస్తున్న బోరిస్‌ జాన్సన్‌ హుటాహుటిన బ్రిటన్‌ తిరిగి వచ్చిన క్రమంలో ప్రీతి పటేల్‌ ట్వీట్‌ చేయటం గమనార్హం. 

బోరిస్‌ జాన్సన్‌ ఆరు వారాల క్రితమే ప్రధాని పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసింది. తన కేబినెట్‌లోని అసమ్మతి నేతలు రాజీనామాలు చేయటం వల్ల ఆయన పదవి నుంచి దిగిపోక తప్పలేదు. అయితే, ఇప్పటికీ ఆయనకు పార్టీలో ఆదరణ తగ్గలేదని స్పష్టమవుతోంది. ఇప్పటికే ముగ్గురు కేబినెట్‌ మంత్రులు బోరిస్‌కు మద్దతు ప్రకటించారు. వాణిజ్య శాఖ మంత్రి జాకబ్‌ రీస్‌ మోగ్‌, రక్షణ మంత్రి బెన్‌ వల్లాస్‌, సిమోన్‌ క్లెర్క్‌లు బోరిస్‌కు అండగా నిలిచారు. ప్రస్తుతం బోరిస్‌ జాన్సన్‌కు 46 మంది ఎంపీల మద్దతు ఉండగా.. రిషీ సునాక్‌కు 100 మంది ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. సోమవారం మధ్యాహ్నం నాటికి ఎవరు పోటీలో ఉండనున్నారని తెలనుంది. అయితే, ఒక్కరే పోటీలో ఉన్నట్లు తెలితే వచ్చే వారమే కొత్త ప్రధాని బాధ్యతలు చేపట్టనున్నారు. కానీ, ఒకవేళ ఇద్దరు బరిలో ఉంటే 1,70,000 మంది పార్టీ సభ్యులు వచ్చే శుక్రవారం ఆన్‌లైన్‌ ఓటింగ్‌లో పాల్గొని తమ నాయకుడిని ఎన్నుకుంటారు.

ఇదీ చదవండి: రాజకీయ పావులు కదుపుతున్న బోరిస్‌.. ఇప్పటికిప్పుడు ప్రధాని పదవి వద్దంటూ రిషి సునాక్‌కు ఆఫర్‌

మరిన్ని వార్తలు