ఆసక్తికర విషయాలు వెల్లడించిన యూకే శాస్త్రవేత్తలు

7 Nov, 2020 10:38 IST|Sakshi

లండన్‌: ప్రపంచ దేశాలన్ని కోవిడ్ -19 కి వ్యతిరేకంగా సమర్థవంతమైన వ్యాక్సిన్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యూకే శాస్త్రవేత్తలు ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. పెయిన్‌ కిల్లర్‌ ఆస్పిరిన్‌తో కోవిడ్‌ని కంట్రోల్‌ చేయవచ్చని తెలిపారు. తాము నిర్వహించిన పరీక్షల్లో సానుకూల ఫలితాలు వచ్చాయని.. త్వరలోనే దీన్ని నిరూపిస్తామని వెల్లడించారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వైరస్‌ బాడిన పడి మరణించిన సంగతి తెలిసిందే. ఈ యూకేలోని అతిపెద్ద ట్రయల్స్‌లో భాగంగా ఆస్పిరిన్‌ కోవిడ్‌ సోకినవారిలో రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని తగ్గిస్తుందో లేదో అంచనా వేసేందుకు గాను ప్రయోగం నిర్వహించారు. సాధారణంగా ఆస్పిరిన్‌ని రక్తాన్ని పల్చబర్చడానికి ఉపయోగిస్తారు. కో చీఫ్‌ ఇన్వెస్టిగేటర్‌ పీటర్‌ హోర్బి  రాయిటర్స్‌తో మాట్లాడుతూ.. "ఇది (ఆస్పిరిన్) ప్రయోజనకరంగా ఉంటుందని నమ్మడానికి స్పష్టమైన ఆధారాలున్నాయి. ఇది సురక్షితమైనది, చవకైనది, విస్తృతంగా అందుబాటులో ఉంది" అని తెలిపారు. కోవిడ్ -19 బారిన పడిన రోగులకు హైపర్-రియాక్టివ్ ప్లేట్‌లెట్స్ వల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదం ఎక్కువగా ఉంది. దానివల్ల మరణాలు అధికంగా సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో యూకే శాస్త్రవేత్తలు నిర్వహించిన ఈ పరీక్షలు ఎంతో ప్రాముఖ్యతను సంపాదించాయి. (చదవండి: కరోనా కట్టడికి అద్భుత వ్యాక్సిన్)

రికవరీ ట్రయల్స్‌ వెబ్‌సైట్ ప్రకారం, ఆస్పిరిన్ యాంటీ ప్లేట్‌లెట్ ఏజెంట్‌గానే కాక రక్తాన్ని గడ్డకట్టించే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పరీక్షల్లో భాగంగా కనీసం 2 వేల మంది రోగులను ఎంపిక చేసి వారికి ప్రతి రోజు 150 మిల్లీగ్రామ్స్‌ ఆస్పిరిన్ ఇచ్చారు. ఇక వీరందరిని సాధారణ చికిత్స పొందుతున్న మరో 2000 మంది కోవిడ్‌ రోగులతో పోల్చినప్పుడు ఆస్పిరిన్‌ వాడిన వారిలో మెరుగైన ఫలితాలు గమనించారు. రాయిటర్స్ ప్రకారం, ప్రతి రోజు చిన్న మొత్తంలో ఆస్పిరిన్‌ తీసుకుంటే కొన్ని రకాల క్యాన్సర్లను నిరోధించవచ్చు అని తెలిపింది. అయితే ఎక్కువ కాలం తీసుకుంటే మూత్రపిండాల దెబ్బతినే ప్రమాదం ఉంది అని నివేదిక తెలిపింది. ఆస్పిరిన్ కాకుండా, రికవరీ ట్రయల్స్‌లో సాధారణ యాంటీ బయాటిక్ అజిథ్రోమైసిన్, రెజెనెరాన్ యాంటీబాడీ కాక్టెయిల్ కూడా ఉన్నాయి. ఈ ఔషధాల కాంబినేషన్‌ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోవిడ్ -19  చికిత్సలో ఉపయోగించారు.

మరిన్ని వార్తలు