Rishi Sunak: బ్రిటన్ కొత్త ప్రధానమంత్రి రిషి సునాక్ స‌క్సెస్ సీక్రెట్ ఇదే..

25 Oct, 2022 16:42 IST|Sakshi

బ్రిటన్‌ కొత్త ప్రధానిగా భారత సంతతి వ్య‌క్తి రిషి సునాక్ ఎన్నికయ్యారు . దీంతో బ్రిటన్‌ ప్రధానిగా మొట్టమొదటి భారత సంతతి వ్యక్తిగా ఈయ‌న‌ చరిత్ర సృష్టించారు. బ్రిటన్‌ పార్లమెంట్‌లో సునాక్‌కు 193 మంది ఎంపీల మద్దతు ఉంది.

దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ప్రధాని పదవికి లిజ్‌ ట్రస్‌ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ట్రస్‌ రాజీనామాతో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో టోరీ సభ్యులు ఈసారి రిషి వైపే మొగ్గు చూపారు. ఆయనే తమ దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించగలరని విశ్వసించారు. దీంతో బ్రిటన్‌ పగ్గాలు చేపట్టే అరుదైన అవకాశం రిషి సునాక్‌ను వరించింది. నెలన్నర రోజుల క్రితం లిజ్‌ట్రస్‌ చేతిలో ఓటమిపాలైన అదే సునాక్‌.. నేడు దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఈ నేప‌థ్యంలో ఆయనకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..

కుటుంబ నేప‌థ్యం:
రిషి సునాక్‌ 1980 మే 12న ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్‌లో జన్మించారు. ఆయన పూర్వీకులు పంజాబ్‌కు చెందిన వారు. వారు తొలుత తూర్పు ఆఫ్రికాకు వలస వెళ్లి..

అక్కడి నుంచి పిల్లలతో సహా యూకేకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. సునాక్ తండ్రి యశ్‌వీర్‌ కెన్యాలో.. తల్లి ఉష టాంజానియాలో జన్మించారు. వీరి కుటుంబాలు బ్రిటన్‌కు వలసవెళ్లాక వివాహం చేసుకున్నారు.

ఉద్యోగం- వివాహాం :
స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీ నుంచి ఎంబీఏ చేసిన రిషి.. తొలుత కొన్ని సంస్థల్లో ఉద్యోగం చేశారు. కాలిఫోర్నియాలో చదువుతున్న రోజుల్లో ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షతాతో పరిచయం ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

►  ప్రస్తుతం 42 ఏళ్ల వయసున్న రిషి సునాక్‌.. బ్రిటన్‌ ప్రధాని పదవి చేపట్టిన అతిపిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించారు.

► ఈ పదవి చేపట్టిన మొట్టమొదటి భారత సంతతి వ్యక్తిగా, తొలి హిందూ వ్యక్తిగా నిలిచారు. అలాగే.. తొలి శ్వేత జాతీయేతర ప్రధానిగా గుర్తింపు పొందారు.

► చదువుకునే రోజుల్లోనే కన్జర్వేటివ్‌ పార్టీలో కొంతకాలం ఇంటర్న్‌షిప్‌ చేశారు. ఆ తర్వాత 2014లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

► 2015లో జరిగిన సాధారణ ఎన్నికల్లో రిచ్‌మాండ్‌ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మరోసారి రిషి విజయం సాధించారు. 2020లో బోరిస్ ప్రధాని బాధ్యతలు చేపట్టాక తన తొలి కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా రిషిని నియమించారు.

► కరోనా సంక్షోభ సమయంలో వ్యాపారులు, కార్మికుల కోసం వందల కోట్ల పౌండ్ల ప్యాకేజీ తీసుకొచ్చి రిషి మంచి గుర్తింపు పొందారు.

► రిషిపై కొన్ని వివాదాలు కూడా వచ్చాయి. ఆయన భార్య ట్యాక్స్ వివాదం, అమెరికా గ్రీన్‌ కార్డు, బ్రిటన్‌ జీవన వ్యయం సంక్షోభం సమయంలో ఆయన కాస్త నెమ్మదిగా స్పందించారనే ఆరోపణలు ఉన్నాయి.

► డౌన్‌స్ట్రీట్‌లో సమావేశానికి హాజరై కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా రిషికి జరిమానా విధించారు.

మరిన్ని వార్తలు