బాప్‌రే.. మనిషినే తాడుగా తిప్పుతూ.. నిమిషంలో 57 సార్లు స్కిప్పింగ్‌..

22 Oct, 2022 19:22 IST|Sakshi

శరీరాన్ని, మనసును దృఢంగా ఉంచుకునేందుకు చాలామంది చాలా రకాల వ్యాయామాలు చేస్తుంటారు. ఫిట్‌నెస్‌కు తోడ్పడే వ్యాయామాలలో స్కిప్పింగ్ కూడా ఒకటి. రోజువారీగా స్కిప్పింగ్‌ చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా చూసుకోవచ్చు. అంతేగాక దీనివల్ల శారీరక, మానసిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. తాజాగా కొందరు వ్యక్తులు స్కిప్పింగ్‌ చేసి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డునే సృష్టించారు .

దీనికి సంబంధించిన వీడియోను గిన్నిస్‌ రికార్డ్స్‌ వాళ్లు తమ ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఇందులో పోటీపడే వాళ్లు రెండు గ్రూప్‌లుగా విడిపోయి టైటిల్‌ కోసం తలపడ్డారు. అయితే సాధారణ తాడుతో ఆడి కాకుండా వినూత్నంగా రికార్డ్‌ క్రియేట్‌ చేశారు. తాడుకు బదులు మనిషిని ఉపయోగిస్తూ స్కిప్పింగ్‌ చేశారు. మనిషిని పైకి కిందకు తిప్పుతూ కేవలం నిమిషంలో  ఏ జట్టు ఎక్కవసార్లు స్కిప్‌లు చేస్తే వారు విజేతలుగా నిలిచినట్లు అవుతుంది.

ఇందులో యూకేకు చెందిన అక్రోపోలిస్‌(బ్లూ డ్రెస్‌) అనే జట్టు, వైల్డ్‌ క్యాట్స్‌ చీర్‌ టీమ్‌తో తలపడింది. అయితే నిమిషంలో 57 సార్లు స్కిప్‌లు పూర్తి చేసి యూకే టీం గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ సాధించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. లక్షల్లో వ్యూస్‌, వేలల్లో లైక్‌లు, కామెంట్‌లు వచ్చి చేరుతున్నాయి. అయితే దీనిని చూసిన నెటిజన్లు ఆశ్యర్చం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ‘వావ్‌.. అద్భుతం’ అని కామెంట్‌ చేస్తుంటే.. మరికొందరు.. ‘ఇది పూర్తయిన తరువాత ఆ అబ్బాయి పాపం వాంతి చేసుకుని ఉంటాడు. బాలుడి తల నేలకు తాకితే ఎంత ప్రమాదం.. దయచేసి ఇలాంటివి అనుకరించవద్దు’  అని సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు