యూకేలో ఉద్యోగుల భారీ సమ్మె

2 Feb, 2023 04:46 IST|Sakshi
బర్మింగ్‌హామ్‌లో ఉద్యోగుల నిరసన ర్యాలీ

లండన్‌: యూకేలో దశాబ్ద కాలంలోనే అతిపెద్ద సమ్మె బుధవారం జరిగింది. సుమారు 5 లక్షల మంది ఉపాధ్యాయులు, కాలేజీ లెక్చరర్లు, ఇతర ప్రభుత్వ సిబ్బంది, రైల్‌ డ్రైవర్లు విధులను బహిష్కరించారు. ఫలితంగా 85% స్కూళ్లు మూతబడ్డాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో రైళ్లు నిలిచిపోయాయి. నాలుగు దశాబ్దాల్లోనే అత్యధికంగా ద్రవ్యోల్బణం 10% మించి పోవడంతో అందుకు తగినట్లుగా వేతనాలు పెంచాలంటూ ఆరోగ్య, రవాణా రంగ సిబ్బంది దగ్గర్నుంచి అమెజాన్‌ వేర్‌ హౌస్‌ ఉద్యోగులు, రాయల్‌ మెయిల్‌ పోస్టల్‌ ఉద్యోగుల వరకు సమ్మెలకు దిగుతున్నారు.

వేతనాల పెంపు డిమాండ్‌తో వచ్చే వారంలో విధులు బహిష్కరిస్తామంటూ నర్సులు, అంబులెన్సు సిబ్బంది, పారామెడిక్స్, ఎమర్జెన్సీ, ఆరోగ్య సిబ్బంది ఇప్పటికే ప్రకటించారు. కాగా, సమ్మెలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రధాని రిషి సునాక్‌ ఆందోళన వ్యక్తం చేశారు. బదులుగా ఉద్యోగులు చర్చలకు రావాలని ఆయన కోరారు. అయితే, సమస్యలను పరిష్కరించడానికి బదులుగా..కొన్ని రంగాల్లో సమ్మెలపై నిషేధం విధించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల వల్ల సంబంధాలు మరింత దెబ్బతింటాయని ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు.

మరిన్ని వార్తలు