వ్యాక్సిన్లు కూడా పని చేయవంటున్న సైంటిస్ట్‌లు..

11 Feb, 2021 16:24 IST|Sakshi

లండ‌న్‌: బ్రిట‌న్‌లో క‌నిపించిన కొత్త రకం కరోనా(యూకే కెంట్‌ కోవిడ్‌ వేరియంట్) చాలా ప్రమాదకరంగా మారవచ్చని అక్కడి టాప్‌ సైంటిస్టులు ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు. ఈ రకం వైరస్‌ వ్యాక్సిన్ల‌ను సైతం బోల్తా కొట్టిస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. యూకేలో కోరలు చాచిన ఈ వేరియంట్‌.. ప్ర‌పంచాన్ని మొత్తం గడగడలాడిస్తుందని యూకే జీనోమిక్స్ డైరెక్ట‌ర్ షార‌న్ పీకాక్ వెల్ల‌డించారు. ఈ వేరియంట్‌కు త‌గట్టుగా వ్యాక్సిన్ల‌ను తయారు చేయాల్సి ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఈ వేరియంట్‌పై బాగానే ప‌ని చేస్తున్నా.. వైర‌స్ కొత్త రూపాలు వ్యాక్సిన్ ప‌నితీరును దెబ్బతీస్తాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 

ప్రస్తుతం యూకేని గడగడలాడిస్తున్న ఈ వేరియంట్‌ను కరోనా 1.1.7గా పిలుస్తున్నారు. కొన్ని నెల‌లుగా ఈ వేరియంట్ యూకే వ్యాప్తంగా విస్తరిస్తోందని, అది మ‌రోసారి మ్యుటేట్ అయితే చాలా ప్రమాదకరంగా మారుతుందని పీకాక్‌ తెలిపారు. ప్ర‌స్తుతం యూకే వేరియంట్‌ వైరస్‌తోపాటు దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వేరియంట్లు చాలా ప్రమాదకరంగా రూపాంతరం చెందుతున్నాయన్నారు. ఒక మ్యుటేష‌న్‌పై విజ‌యం సాధిస్తే, వైర‌స్ మ‌రో మ్యుటేష‌న్‌తో స‌వాలు విసురుతుంద‌ని, ఇలా క‌నీసం ప‌దేళ్ల పాటు మ్యుటేష‌న్ల‌ నుంచి సవాల్లు ఎదుర్కోక త‌ప్ప‌ద‌ని పీకాక్ హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు