బ్రిటన్ తదుపరి ప్రధానిని ప్రకటించేంది అప్పుడే.. రేసులో రిషి సునక్‌ సహా 11 మంది!

12 Jul, 2022 10:38 IST|Sakshi

లండన్: బ్రిటన్‌ కొత్త ప్రధాని ఎంపికకు ముహూర్తం ఖరారు చేసింది అధికార కన్జర్వేటివ్ పార్టీ. సెప్టెంబర్‌ 5న  పార్టీ నాయకుల సమక్షంలో కొత్త ప్రధాని పేరును అధికారికంగా ప్రకటించనుంది. ప్రధాని పదవికి పోటీ పడేందుకు 11 మంది నేతలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. రేసులో ఉండాలనుకునేవారు నామినేషన్లు సమర్పించేందుకు మంగళవారం ఒక్కరోజే గడువుంది. వేసవి విరామం అనంతరం బ్రిటన్‌ పార్లమెంట్‌ సెప్టెంబర్‌లోనే తిరిగి ప్రారంభమవుతుంది. అప్పుడే కొత్త ప్రధాని ప్రకటన ఉండనుంది.

రౌండ్ల వారీగా ఓటింగ్..
ప్రధాని పదవికి పోటీ పడాలనుకునే వారికి కనీసం 20 మంది ఎంపీల మద్దతు ఉండాలి. పోటీలో ఉన్నవారిని పార్టీ నేతలు బ్యాలెట్ ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు. రౌండ్ల వారీగా ఓటింగ్ నిర్వహించి తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎలిమినేట్ చేస్తూ ఉంటారు. చివరకు మిగిలిన ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారే కన్జర్వేటివ్ పార్టీ నూతన సారథిగా, ప్రధానిగా బాధ్యతలు చేపడుతారు. ఈ ప్రక్రియ బుధవారం నుంచే ప్రారంభమవుతుంది.

కొత్త ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన రిషి సునక్ ఉన్నారు. మొన్నటివరకు ఆర్థిక మంత్రిగా సేవలందించిన ఈయన బోరిస్ జాన్సన్‌ కేబినెట్ నుంచి మొదటగా తప్పుకున్నారు. ఆ తర్వాత సొంత ప్రభుత్వంలో మంత్రులతో పాటు మొత్తం 58 మంది రాజీనామా చేశారు. దీంతో పదవి నుంచి తప్పుకుంటున్నట్లు బోరిస్ ప్రకటించారు. కొత్త ప్రధాని ఎంపిక జరిగేవరకు తాత్కాలిక ప్రధానిగా కొనసాగుతానన్నారు.
చదవండి: Who Is Rishi Sunak: బ్రిటన్ తదుపరి ప్రధానిగా భారత సంతతి వ్యక్తి! అదే నిజమైతే చరిత్రే..

మరిన్ని వార్తలు