భారత్‌కు బ్రిటన్‌ ప్రధాని.. అహ్మదాబాదే ఎందుకు ?

20 Apr, 2022 08:10 IST|Sakshi

వాణిజ్యమే ప్రధాన ఎజెండా 

ఉక్రెయిన్‌ సంక్షోభంపైనా చర్చలు

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తీవ్రతరమై అంతర్జాతీయంగా సంక్షోభం నెలకొన్న వేళ...  బ్యాంకులను వేల కోట్లకు మోసగించిన విజయ్‌ మాల్యా వంటివారు బ్రిటన్లో తలదాచుకున్న నేపథ్యంలో... బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తొలిసారిగా భారత్‌ పర్యటనకు వస్తుండటం ఆసక్తి రేపుతోంది.  ఆయన బ్రిటన్‌ నుంచి నేరుగా ఢిల్లీకి కాకుండా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు ఎందుకు వస్తున్నారు? ఇరు దేశాలు ప్రధానంగా ఏయే అంశాలపై దృష్టి సారించనున్నాయి? 

ఉక్రెయిన్‌పై రష్యా అణుదాడికి దిగుతుందన్న అనుమానాల నేపథ్యంలో బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ భారత పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. బ్రిటన్‌తో పాటు అమెరికా, పశ్చిమ దేశాలన్నీ రష్యా తీరును తీవ్రంగా నిరసిస్తుంటే భారత్‌ తటస్థ వైఖరి అవలంబించడం అంతర్జాతీయ సమాజానికి మింగుడు పడటం లేదు. ఈ నేపథ్యంలో జాన్సన్, ప్రధాని మోదీ, ముఖాముఖిపై ఆసక్తి నెలకొంది. జాన్సన్‌ గురువారం బ్రిటన్‌ నుంచి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ చేరుకుని పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. శుక్రవారం ఢిల్లీలో మోదీతో భేటీ అవుతారు.

యుద్ధంపై చర్చ 
ప్రధానుల చర్చల్లో యుద్ధం ప్రధానంగా చర్చకు రానుంది. భారత తటస్థ వైఖరిని, రష్యా నుంచి భారత్‌ ఆయుధాలు, చమురు కొనుగోలు చేస్తుండటాన్ని జాన్సన్‌ ప్రస్తావించవచ్చంటున్నారు. ఉక్రెయిన్‌కు భారత్‌ ఆశించినంతగా మద్దతివ్వడం లేదంటూ బ్రిటన్‌ వాణిజ్య మంత్రి అన్నె మారియా ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేశారు. 

ద్వైపాక్షిక వాణిజ్యం
బ్రిటన్‌ యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బయటకు వచ్చాక ఈయూపై ఆధారపడటం తగ్గించుకొని ఇతర దేశాలతో వ్యూహాత్మకంగా బంధాలను పెంచుకుంటోంది. ఇందులో భాగంగానే భారత్‌తో స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందంపై ఇప్పటికే పలు చర్చలు జరిపింది. ఇది కుదిరితే 2035 నాటికి భారత్‌తో బ్రిటన్‌ వాణిజ్యం ఏడాదికి 2,800 కోట్ల పౌండ్లు పెరుగుతుందని అంచనా. భారత్‌ వైపు నుంచి మేకిన్‌ ఇండియా ప్రాజెక్టులో భాగంగా రెండు  వేల కంపెనీలు బ్రిటన్‌లో పెట్టుబడులు పెట్టాయి. లక్ష ఉద్యోగాల కల్పన జరిగింది.

చదవండి: (లీటర్‌ పెట్రోల్‌ రూ.338.. బస్సు ఛార్జీలు ఏకంగా 35 శాతం పెరిగి..)

2030కి రోడ్‌మ్యాప్‌ 
2030 నాటికి భారత్, బ్రిటన్‌ మధ్య బంధం బలోపేతమయ్యేలా గతేడాది జరిగిన వర్చువల్‌ సదస్సులో ప్రణాళిక రూపొందించారు. వస్తు సేవల్లో వాణిజ్యాన్ని 2030 నాటికి 10 వేల కోట్ల డాలర్లకు పెంచుకోవడం లక్ష్యంగా నిర్ణయించారు. పలు రంగాల్లో పలు ఒప్పందాలు కుదిరే అవకాశముంది.

ఆర్థిక నేరగాళ్ల అప్పగింత 
భారత్‌లో బ్యాంకులకు వేల కోట్ల రూపాయలకు కుచ్చుటోపీ వేసి బ్రిటన్‌కు పరారైన విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీల అప్పగింత ప్రక్రియను వేగవంతం చేయాలని జాన్సన్‌ను భారత్‌ కోరనుంది. ఆర్థిక నేరగాళ్లను వీలైనంత త్వరగా అప్పగించాలని గతేడాది వీడియో కాన్ఫరెన్స్‌ సదస్సులో మోదీ డిమాండ్‌ చేశారు. అందుకు చర్యలు తీసుకుంటామని బ్రిటన్‌ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో పర్యటనలో మాల్యా, నీరవ్‌ అప్పగింతలో తాజాగా ముందడుగు పడుతుందని భారత్‌ భావిస్తోంది. 
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

అహ్మదాబాదే ఎందుకు ?  
బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ నేరుగా అహ్మదాబాద్‌ ఎందుకు వస్తున్నారన్నది చర్చనీయంగా మారింది. బ్రిటన్‌లో నివసించే ఆంగ్లో ఇండియన్‌ జనాభాలో సగం మందికి పైగా అహ్మదాబాద్‌కు చెందిన వారే. అయినా ఇప్పటిదాకా ఏ బ్రిటన్‌ ప్రధానీ గుజరాత్‌లో అడుగు పెట్టలేదు. ఆంగ్లో ఇండియన్‌ ఓటు బ్యాంకుని దృష్టిలో ఉంచుకొనే జాన్సన్‌ తొలుత అహ్మదాబాద్‌ వెళ్తున్నట్టు బ్రిటన్‌ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు, ఈ ఏడాది చివర్లో గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో జాన్సన్‌ పర్యటన ద్వారా ఎన్నికల్లో లబ్ధికి మోదీ ప్రయత్నిస్తున్నారన్న వాదనా ఉంది. గుజరాత్‌ పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రం గనుక పరస్పరం పెట్టుబడులు ఆకర్షించాలన్నదే కారణమని కూడా చెప్తున్నారు. 

చదవండి: (కమలా హారిస్‌ రక్షణ సలహాదారుగా శాంతి సేథి)

మరిన్ని వార్తలు