UK PM Election Results 2022: బ్రిటన్‌ పీఠం ట్రస్‌దే

6 Sep, 2022 05:13 IST|Sakshi
ఫలితాల వెల్లడి సందర్భంగా ట్రస్, రిషి

చివరిదాకా పోరాడి ఓడిన రిషి

హోరాహోరీగా సాగిన ఎన్నిక

నేడు ప్రధానిగా ట్రస్‌ ప్రమాణం

మూడో మహిళా పీఎంగా రికార్డు

లండన్‌/న్యూఢిల్లీ: బ్రిటన్‌ ప్రధాని పీఠం కోసం జరిగిన పోరులో విదేశాంగ మంత్రి మేరీ ఎలిజబెత్‌ (లిజ్‌) ట్రస్‌ (47)దే పై చేయి అయింది. హోరాహోరి పోరులో భారత సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌ (42)పై ఆమె విజయం సాధించి కన్జర్వేటివ్‌ పార్టీ నేతగా ఎన్నికయ్యారు. తద్వారా బోరిస్‌ జాన్సన్‌ వారసురాలిగా ప్రధాని పదవి చేపట్టనున్నారు. సోమవారం వెల్లడైన ఫలితాల్లో ట్రస్‌ 81,326 ఓట్లు సాధించారు. రిషికి 60,399 ఓట్లు పోలయ్యాయి.

ఫలితాల అనంతరం ట్రస్‌ మాట్లాడారు. పార్టీ నేతగా ఎన్నికవడం గొప్ప గౌరవమన్నారు. తనపై నమ్మకముంచినందుకు పార్టీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘మేం చేసి చూపిస్తాం’ అంటూ ముమ్మారు ప్రతిజ్ఞ చేశారు. ‘‘పన్నులకు కోత విధించి ప్రజలపై భారం తగ్గించి చూపిస్తాం. ఇంధన సంక్షోభాన్ని అధిగమిస్తాం. ఈ కష్టకాలం నుంచి దేశాన్ని గట్టెక్కించడానికి సాహసోపేతమైన చర్యలు చేపడతా. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ సామర్థ్యం ఏమిటో ప్రపంచానికి మరోసారి చూపిద్దాం’’ అంటూ అనంతరం ట్వీట్‌ చేశారు.

రిషి చివరిదాకా తనకు పోటీ ఇచ్చారంటూ అభినందించారు. ప్రధానిగా బోరిస్‌ ఘన విజయాలు సాధించారంటూ ఆకాశానికెత్తారు. మార్గరెట్‌ థాచర్, థెరిసా మే తర్వాత బ్రిటన్‌ ప్రధాని కానున్న మూడో మహిళ ట్రస్‌. పన్నుల తగ్గింపు హామీలు, రిషిపై కోపంతో జాన్సన్‌ లోపాయికారీ మద్దతు తదితరాలు ట్రస్‌ గెలుపుకు ప్రధానంగా పని చేశాయని చెబుతున్నారు. తాత్కాలిక ప్రధాని జాన్సన్‌ లాంఛనంగా రాజీనామా సమర్పించిన అనంతరం మంగళవారం ట్రస్‌ బాధ్యతలు స్వీకరిస్తారు.

ఆమె నిర్ణయాత్మక విజయం సాధించారంటూ జాన్సన్‌ అభినందించారు. ‘‘నానాటికీ పెరిగిపోతున్న జీవన వ్యయం వంటి సమస్యలను ఎదుర్కొనేందుకు, పార్టీని, దేశాన్ని ముందుకు నడిపేందుకు ట్రస్‌ వద్ద సరైన ప్రణాళికలున్నాయి. పార్టీ నేతలంతా ఆమె వెనక నిలవాల్సిన సమయమిది’’ అంటూ ట్వీట్‌ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ట్రస్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె నాయకత్వంలో ద్వైపాక్షిక, వ్యూహాత్మక సంబంధాలు మరింత పటిష్టమవుతాయని ఆశాభావం వెలిబుచ్చారు.

రిషి సంచలనం
పార్టీ గేట్, విశ్వసనీయతకు సంబంధించిన ఆరోపణలతో ప్రధాని పదవికి బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా చేయాల్సి రావడం తెలిసిందే. నైతికత లేని జాన్సన్‌ సారథ్యంలో పని చేయలేనంటూ ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేయడం ద్వారా రిషి సంచలనం సృష్టించారు. మంత్రులంతా ఆయన బాటే పట్టి వరుసగా రాజీనామా చేయడంతో జాన్సన్‌ అయిష్టంగానే తప్పుకోవాల్సి వచ్చింది. తద్వారా వచ్చి పడ్డ కన్జర్వేటివ్‌ పార్టీ నేత ఎన్నికలో మెజారిటీ ఎంపీల మద్దతు కూడగట్టడం ద్వారా తొలుత రిషియే ముందంజలో ఉన్నారు. తర్వాత ట్రస్‌ అనూహ్యంగా దూసుకెళ్లారు.

1,72,437 లక్షల కన్జర్వేటివ్‌ ఓటర్లను ఎక్కువ మందిని ఆకర్షించడంలో సఫలమయ్యారు. ఆమెకు 57.4 శాతం ఓట్లు పోలవగా రిషికి 42.6 శాతం వచ్చాయి. ఆయన ఓటమి చవిచూసినా బ్రిటన్‌ ప్రధాని పదవి కోసం తలపడ్డ తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. తనకు ఓటేసిన అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ‘‘కన్జర్వేటివ్‌ సభ్యులమంతా ఒకే కుటుంబం. ఈ కష్టకాలం నుంచి గట్టెక్కించే ప్రయత్నాల్లో మనమంతా కొత్త ప్రధాని ట్రస్‌కు దన్నుగా నిలుద్దాం’’ అంటూ ట్వీట్‌ చేశారు. పన్నుల విషయంలో ట్రస్‌తో విధానపరమైన వైరుధ్యం కారణంగా రిషి ఆమె కేబినెట్లో చేరడం అనుమానమేనంటున్నారు.

అంచెలంచెలుగా ఎదిగి...
బ్రిటన్‌ నూతన ప్రధాని లిజ్‌ ట్రస్‌ కరడుగట్టిన కమ్యూనిస్టుల కుటుంబం నుంచి వచ్చారు. ఆమె 1975లో ఆక్స్‌ఫర్డ్‌లో జన్మించారు. తండ్రి మ్యాథ్స్‌ ప్రొఫెసర్‌ కాగా తల్లి నర్స్‌ టీచర్‌. యూకేలో పలు ప్రాంతాల్లో విద్యాభ్యాసం సాగింది. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ వచ్చారు. 2001, 2005ల్లో ఓటమి పాలైనా 2010లో నార్‌ఫోక్‌ నుంచి ఎంపీగా విజయం సాధించారు. 2014లో కేమరూన్‌ కేబినెట్లో పర్యావరణ మంత్రిగా, 2016లో థెరిసా మే ప్రభుత్వంలో న్యాయ శాఖ మంత్రిగా చేశారు. 2019లో బోరిస్‌ జాన్సన్‌ ప్రధాని అయ్యాక ట్రస్‌కు ప్రాధాన్యం పెరిగింది. తొలుత ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ సెక్రెటరీగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో భారత్‌లో పటిష్టమైన ఆర్థిక బంధం కోసం కృషి చేశారు.

భారత్‌–ఇంగ్లండ్‌ వర్తక భాగస్వామ్యం (ఈటీపీ)లో కీలక పాత్ర పోషించారు. రెండేళ్లకు కీలకమైన విదేశాంగ శాఖ బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు జాన్సన్‌ వారసురాలిగా ఎన్నికయ్యారు. అకౌంటెంట్‌ హ్యూ ఓ లియరీని ట్రస్‌ పెళ్లాడారు. వారికి ఇద్దరమ్మాయిలు. పరిస్థితిని బట్టి విధానాలు మార్చుకునే నేతగా కూడా ట్రస్‌ పేరుబడ్డారు. యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగడాన్ని (బ్రెగ్జిట్‌) తొలుత తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ అది అనివార్యమని తేలాక బ్రెగ్జిట్‌కు జైకొట్టారు. కన్జర్వేటివ్‌ సభ్యుల మద్దతు సాధించే ప్రయత్నాల్లో భాగంగా మాజీ ప్రధాని మార్గరెట్‌ థాచర్‌ వస్త్రధారణను అనుకరించారు.

మరిన్ని వార్తలు