లాక్‌డౌన్‌లో ఫ్రీ ఆన్‌లైన్‌ భాంగ్రా క్లాసులు‌

1 Aug, 2020 20:52 IST|Sakshi

లండన్‌: లాక్‌డౌన్‌ కాలంలో ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి ఫ్రీ ఆన్‌లైన్‌ భాంగ్రాసైజ్‌ సెషన్లతో యూకే వాసులకు సాయం చేస్తోన్న భారత సంతతి డ్యాన్సర్‌ రాజీవ్‌ గుప్తాపై ఆ దేశ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో గత నెలలో రాజీవ్‌ గుప్తాకు ‘పాయింట్‌ ఆఫ్‌ లైట్‌ ’అనే గౌరవం కూడా లభించింది. సమాజంలో మార్పు కోసం కృషి చేస్తోన్న వాలంటీర్లను యూకేలో ప్రతివారం ‘పాయింట్‌ ఆఫ్‌ లైట్’‌ పేరుతో గౌరవిస్తారు. ఈ సందర్భంగా జాన్సన్‌ రాజీవ్‌ గుప్తాను ప్రశంసిస్తూ ఓ లేఖ రాశారు. ‘గత కొన్ని నెలలుగా మీ భాంగ్రా క్లాసులు.. లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా ఇళ్లకే పరిమితమైన ప్రజల్లో శక్తిని నింపుతున్నాయి. ప్రజలు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి మీ తరగతలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఈ క్లిష్ట సమయంలో మీరు చాలా మందికి ‘పాయింట్‌ ఆఫ్‌ లైట్‌‌’గా నిలిచారు. మిమ్మల్ని ఈ విధంగా గుర్తించగలగినందుకు నేను సంతోషిస్తున్నాను’ అని జాన్సన్‌ లేఖలో పేర్కొన్నారు. (‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ సైకిల్‌పై బ్రిటన్‌ ప్రధాని)

ఈ సందర్భంగా రాజీవ్‌ గుప్తా మాట్లాడుతూ.. ‘మనం ఉల్లాసంగా, సానుకూలంగా, శక్తివంతగా ఉండటానికి భాంగ్రా డ్యాన్స్‌‌ సాయం చేస్తుందని నేను నమ్ముతాను. నా భాంగ్రా సైజ్ సెషన్లతో లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలకు ఈ విధంగా సాయం చేయగల్గుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా ప్రయత్నం ఇంత శక్తివంతమైన ప్రభావాన్ని చూపిస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు’ అన్నారు. రాజీవ్‌ గుప్తా గత 15 సంవత్సరాలుగా భాంగ్రా డ్యాన్స్‌ నేర్పిస్తున్నారు. మాంచెస్టర్, బర్మింగ్‌హామ్‌లో రెగ్యులర్ డ్యాన్స్ ఫిట్‌నెస్ తరగతులను నిర్వహిస్తున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే లండన్ 2012 ఒలంపిక్స్ ప్రారంభోత్సవంలో రాజీవ్‌ గుప్తా ప్రదర్శన ఇచ్చారు. అంతేకాక బీబీసీ ప్రసిద్ధ ‘స్ట్రిక్ట్లీ కమ్ డాన్సింగ్’ ప్రదర్శనలో భాంగ్రా గురించి ప్రొఫెషనల్ డ్యాన్సర్లకు శిక్షణ ఇచ్చారు.

మరిన్ని వార్తలు