రాజకీయ పావులు కదుపుతున్న బోరిస్‌.. ఇప్పటికిప్పుడు ప్రధాని పదవి వద్దంటూ రిషి సునాక్‌కు ఆఫర్‌

22 Oct, 2022 12:34 IST|Sakshi

దాదాపుగా వంద మంది అధికార కన్జర్వేటివ్‌ పార్టీ ఎంపీల మద్దతుతో ప్రధాని పదవి పోటీకి సిద్ధమయ్యారు రిషి సునాక్‌. లిజ్‌ ట్రస్‌ రాజీనామాతో సెకండ్‌ ఛాయిస్‌గా మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌కే పగ్గాలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే.. ఈ రేసులోకి మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ సైతం వచ్చి చేరారు. 

సెలవులపై కరేబియన్‌ దీవులకు(డొమినికన్‌ రిపబ్లిక్‌) వెళ్లిన బోరిస్‌ జాన్సన్‌.. తాజా రాజకీయ పరిణామాలతో హడావిడిగా లండన్‌కు బయలుదేరారు. అయితే.. ఈలోపే ఆయన రిషి సునాక్‌తో సంప్రదింపులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. తదుపరి ప్రధాని అయ్యే అవకాశం తనకు ఇవ్వాలని బోరిస్‌.. రిషి సునాక్‌కు కోరినట్లు లండన్‌కు చెందిన ది టెలిగ్రాఫ్‌ ఓ కథనం ప్రచురించింది.

ఒకవైపు రూలింగ్‌ పార్టీ ప్రాబల్యం, జనాదరణ కోల్పోయినందున.. ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రాజకీయ సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రధాని అవకాశం తనకు ఇవ్వాలని.. తద్వారా 2024 డిసెంబర్‌లో జరగబోయే ఎన్నికల్లో ఓటమి నుంచి కన్జర్వేటివ్‌ పార్టీని గట్టెక్కించగలనని రిషి సునాక్‌తో బోరిస్‌ జాన్సన్‌ చెప్పినట్లు ఆ కథనం తెలిపింది. 

ప్రస్తుతానికి డిప్యూటీ పీఎం పదవిని ఆఫర్‌ చేసిన బోరిస్‌.. 2024 ఎన్నికల నాటికి కన్జర్వేటివ్‌ పార్టీ తరపున ప్రధాని అభ్యర్థిగా నిలబడవచ్చని రిషి సునాక్‌ను ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడాల్సిన అవసరం ఉందని.. కాబట్టి ప్రధాని అవకాశం తనకు ఇవ్వాలని రిషి సునాక్‌ను బోరిస్‌ జాన్సన్‌ కోరినట్లు టెలిగ్రాఫ్‌ కథనం పేర్కొంది. అయితే.. బోరిస్‌ ఆఫర్లను రిషి సునాక్‌ తిరస్కరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటూ మరో కథనం ప్రచురించింది టెలిగ్రాఫ్‌.

ఇదీ చదవండి: తర్వాతి వైరస్‌ పుట్టుక అక్కడి నుంచేనా?

ఎక్స్‌ ఛాన్స్‌లర్‌ రిషి సునాక్‌కు 93 మంది సభ్యులు మద్దతు ప్రకటించగా.. టోబియాస్‌ ఎల్‌వుడ్‌ తాను వందవ మద్దతుదారుడినని ప్రకటించడం విశేషం. తద్వారా రిషి సునాక్‌కు పోటీలో నిలబడడానికి అవసరమైన 100 మంది ఎంపీల మద్దతు లభించినట్లయ్యింది. ఇక.. మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు 44 మంది మద్దతు ఉండగా.. మూడో స్థానంలో పెన్నీ మోర్డాంట్‌ 21 మంది మద్దతుతో ఉన్నారు. బ్రిటిష్‌ కాలమానం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నాం 2గం. వరకు నామినేషన్లకు గడువు ఉంది. అదే రోజు కన్జర్వేటివ్‌ పార్టీ నేత కోసం ఎన్నిక సైతం జరిగే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు