బ్రిటన్‌ ప్రధాని రేసు: ఊహించని మలుపులు.. ప్రీతి పటేల్‌ అవుట్‌

12 Jul, 2022 20:12 IST|Sakshi

లండన్‌: బ్రిటన్‌ రాజకీయాల్లో ఇవాళ కీలక, ఊహించని పరిణామాలే చోటుచేసుకున్నాయి. కన్జర్వేటివ్‌ పార్టీ తరపున ప్రధాని అభ్యర్థి విషయంలో మాజీ ఛాన్స్‌లర్‌ రిషి సునాక్‌కు అవకాశాలు కొంచెం కొంచెంగా మెరుగు అవుతున్నాయి. అదే సమయంలో.. బ్రిటన్‌ హోం సెక్రెటరీ ప్రీతి పటేల్‌(50) కీలక నిర్ణయం ప్రకటించారు. ప్రధాని రేసులో తాను దిగట్లేదని కాసేపటి కిందట ఆమె స్పష్టం చేశారు.

2016 బ్రెగ్జిట్‌ రిఫరెండమ్‌లో డేవిడ్‌ కామెరున్‌ క్యాబినెట్‌ నుంచి బోరిస్‌ జాన్సన్‌, మైకేల్‌ గోవ్‌తో పాటు ప్రీతి పటేల్‌ కూడా కీలకంగా వ్యవహరించారు. ఈ తరుణంలో..కన్జర్వేటివ్‌ పార్టీ తరపున నాయకత్వ రేసులో ఆమె దిగుతారని అంతా భావించారు. అయితే పోటీలో తాను లేనని హోం సెక్రటరీ ప్రీతి సుశీల్‌ పటేల్‌ ప్రకటించారు. సహచరుల నుంచి లభిస్తున్న మద్దతుకు కృతజ్ఞతలని ఆమె పేర్కొన్నారు.

అంతకు ముందు ఆమె మద్దతుదారులు.. పోటీ విషయంలో ఆమె ధృడంగా ఉన్నారని, సుదీర్ఘకాలం బ్రెగ్జిటర్‌గా ఉన్నారని పేర్కొన్నారు. అంతేకాదు.. ప్రీతి పటేల్‌ను మార్గరేట్‌థాచర్‌తో పోల్చారు కొందరు సభ్యులు. అయితే ఆమె మాత్రం పోటీలో ఉండడం లేదని క్లారిటీ ఇచ్చారు. సరిపడా మద్దతు లేనందునే ఆమె తప్పుకున్నట్లు తెలుస్తోంది.కానీ, పటేల్‌కు విద్యా మంత్రి ఆండ్రియా జెన్‌కీన్స్‌, న్యాయశాఖ మంత్రి టామ్‌ పుర్సుగ్లోవ్‌తో పాటు పదమూడు మంది సభ్యుల మద్దతు ఉంది. ఈ మద్దతు కోసం ఇప్పుడు మిగతా సభ్యులు చూస్తున్నారు.

మరోవైపు రేసులో ఉన్న రిషి సునాక్‌(42) భారత సంతతి వ్యక్తికాగా, ప్రతీ కూడా భారత సంతతి వ్యక్తే కావడం గమనార్హం.  ఇప్పటికే సువెల్లా బ్రావర్మన్‌, లిజ్‌ ట్రుస్స్‌లు బ్రిటన్‌ ప్రధాని రేసులో నిలబడ్డారు. 

ఇదిలా ఉంటే.. ప్రధాని రేసులో నిల్చునే అభ్యర్థి పేరును బ్యాలెట్‌ పేపర్‌లో చేర్చాలంటే కనీసం 20 ఎంపీల మద్దతు అయినా అవసరం ఉంటుంది. 


కన్జర్వేటివ్‌ పార్టీ తరపున అభ్యర్థి కోసం నిర్వహించిన ఓటింగ్‌లో.. 

ఊహించని మలుపులు
ఇదిలా ఉంటే.. బ్రిటన్‌ రాజకీయాల్లో ఇవాళ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఉప ప్రధాని డోమినిక్‌ రాబ్‌, రవాణా శాఖ మంత్రి గ్రాంట్‌ షాప్స్‌లు.. రిషి సునాక్‌ నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రకటన చేశారు. అంతేకాదు.. రాబ్‌ స్వయంగా సునాక్‌ ప్రచార ఈవెంట్‌ను లాంచ్‌ చేశారు ఇవాళ. ఇదిలా ఉంటే.. ప్రధాని రేసు నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించిన గ్రాంట్‌ షాప్స్‌.. ట్విటర్‌ ద్వారా సునాక్‌ అనుభవానికి, అర్హతకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.

చదవండి: బ్రిటన్ తదుపరి ప్రధానిని ప్రకటించేంది అప్పుడే!

మరిన్ని వార్తలు