పోలీసులకు చిక్కకుండా గర్ల్‌ఫ్రెండ్‌ టెడ్డీబేర్‌లో దాక్కున్న దొంగ.. చివరికి

15 Aug, 2022 15:20 IST|Sakshi

కొత్తగా ఏదైనా షాప్‌ ఓపెన్‌ అయినప్పుడు.. కార్టూన్‌ క్యారెక్టర్స్‌ వేషంలో ప్రమోషన్స్‌ చేయడం చూస్తూనే ఉంటాం. కానీ.. టెడ్డీబేర్‌ను మరీ కొత్తగా వాడాడు మాంచెస్టర్‌కు చెందిన ఓ యువకుడు. పోలీసులకు చిక్కకుండా ఉండటానికి టెడ్డీబేర్‌లో దాక్కున్నాడు. అసలేం దొంగతనం చేశాడు? అలా ఎలా దాక్కున్నాడంటే? 18 ఏళ్ల జాషువా డాబ్సన్‌ చిన్నచిన్న దొంగతనాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్నాడు. ఇటీవల ఓ కారును దొంగిలించాడు. దాంట్లో ఫ్యూయల్‌ పోసుకుని బంక్‌లో డబ్బులు కట్టకుండా వెళ్లిపోయాడు. దీంతో అతనిమీద మరో రెండు కేసులు నమోదయ్యాయి.

పోలీసులు తనకోసం వెతుకుతుండటంతో భయపడ్డ డాబ్సన్‌ దాక్కోవడానికి గర్ల్‌ఫ్రెండ్‌ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఉన్న ఐదు అడుగుల టెడ్డీబేర్‌ను కట్‌చేసి, అందులో కొంత స్టఫ్‌ తీసేసి, మనోడు అందులో కూర్చున్నాడు. పోలీసులు చివరకు డాబ్సన్‌ గర్ల్‌ఫ్రెండ్‌ ఇంటికి వచ్చి వెదకడం మొదలుపెట్టారు. టెడ్డీబేర్‌ శ్వాస తీసుకుంటున్న చప్పుడు రావడంతో అనుమానం వచ్చి దాన్ని కట్‌ చేసి చూశారు.

ఇంకేముంది... అందులోంచి డాబ్సన్‌ బయటికొచ్చాడు. కార్ల దొంగతనంతోపాటు, అతనిపై రెండుమూడు పెటీ కేసులు కూడా ఉండటంతో డాబ్సన్‌కు కోర్టు తొమ్మిదినెలల జైలు శిక్ష విధించింది. అలాగే డ్రైవింగ్‌ చేయకుండా అతనిపై 27 నెలలపాటు నిషేధించింది. మాంచెస్టర్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీ ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసిన ఈ వార్త వైరల్‌ అవుతూ నెటిజన్స్‌కు నవ్వులు పంచుతోంది. ‘సూపర్‌ క్రియేటివిటీ’, ‘పా పెట్రోల్‌’, ‘‘అన్‌ ‘బేర’బుల్‌’’, ‘టెడ్డీబేర్‌ను ఇలా కూడా వాడుకోవచ్చా’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.  
చదవండి: ఇదేం పెళ్లి.. భార్యకాని భార్యతో కలసి పోజులిచ్చి

మరిన్ని వార్తలు